మంచిమాట: అత్యాశకు పోతే.. మిగిలేది నిరాశే..

Divya

అత్యాశ అనర్థాలకు దారితీస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరూ కూడా అత్యాశ లేకుండా జీవించడం కష్టం. మనిషికి ఆశ ఉండాలే తప్ప అత్యాశ ఉండకూడదు. ఒకవేళ అత్యాశకు లోనైతే మనిషి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తాడు. ఉదాహరణకు ఒక మనిషి అత్యాశకు గురైతే ఎలా ఉంటాడు అనే దానికి ఒక చిన్న కథ రూపంలో ఇప్పుడు తెలుసుకుందాం..

అనగనగా ఒక ఊరిలో కేశవయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక ముసలి ఏనుగు కూడా ఉండేది. ఇక ఆ ఊరిలో పెళ్లిళ్లు జరిగినా, తిరునాళ్ళు జరిగినా ఊరేగింపు కోసం ఆ ఏనుగును అద్దెకు ఇస్తూ ఉండేవాడు ఆ వ్యాపారి. ఒకసారి సోమయ్య అనే ఒక రైతు, తన కొడుకు పెళ్లి కోసం ఏనుగును అద్దెకు తీసుకున్నాడు. ఆ ఏనుగు  మీద తన కొడుకు ఊరేగింపు బాగానే జరిగింది. కానీ ఆ ఏనుగు కు  సుస్తీ చేసింది. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది ఆ ఏనుగు.

ఇక ఈ విషయం తెలుసుకున్న సోమయ్య..గబగబా వెళ్లి జరిగిన విషయమంతా కేశవయ్యకు చెప్పాడు. ఇక ఈ విషయం విన్న కేశవయ్య వెంటనే పెద్ద ఎత్తున ఏడవడం మొదలు పెట్టాడు. అయితే.." నేను ఆ ఏనుగును చిన్నగా ఉన్నప్పుడే కొనుక్కున్నాను. అదంటే నాకు చాలా ప్రాణం. నా ఏనుగును నాకు తిరిగి ఇవ్వు లేదా  నీ ఆస్తి మొత్తం రాసి ఇవ్వు".. అని అన్నాడు కేశవయ్య. ఇక అందుకు సోమయ్య.." కావాలంటే పరిహారంగా ఆ ఏనుగు ధరకి రెట్టింపు ఇస్తాను.. దాని దహన సంస్కారాలు కూడా నేనే చేస్తాను". అని అన్నాడు.
కానీ కేశవయ్య ఒప్పుకోలేదు.."నా ఏనుగును నాకు ఇవ్వు".. అంటూ పట్టుపట్టాడు.

దాంతో సోమయ్య ఆ ఊరి పెద్ద అయిన రామారావు దగ్గరకు వెళ్లి తన గోడును వినిపించాడు. ఇక రామారావు ఆయనకు ఒక ఉపాయం చెప్పాడు.ఆ తర్వాత రోజు కేశవయ్యను పిలిపించాడు ఆ ఊరి పెద్ద. మీ వాదన ఇక్కడ తెగదు కానీ సోమయ్యను పిలుచుకు రా ..ముగ్గురం కలిసి న్యాయస్థానానికి వెళ్దాం అన్నాడు. ఇక కేశవయ్య సోమయ్యను పిలుచుకు రావడానికి సోమయ్య ఇంటికి వెళ్తే ,అతని గుమ్మం తలుపు కొంచెం మూసి ఉంది. సోమయ్యా..!  అని పిలుస్తూ తలుపుని కేశవయ్య నెట్టగానే , అక్కడ తలుపు వెనుక ఉన్న కుండల దంత ఒకటి కింద పడింది . అక్కడున్న కుండలన్నీ పగిలిపోయాయి.

ఇక లోపలి నుంచి వచ్చిన సోమయ్య జరిగినదంతా చూసి.. "అయ్యో..! ఈ కుండలు మా నాన్న కాలంలో కొన్నవి . వాటిని నేను ప్రాణంగా చూసుకుంటున్నాను.. కేశవయ్య..! నా కుండల్ని ఉన్నది ఉన్నట్టు తెచ్చివ్వు.. లేదా కోటి రూపాయలు ఇవ్వు" అన్నాడు..  అప్పుడు కేశవయ్య.. "ఏంటి..? కుండలకు కోటి రూపాయలా.. ఇదెక్కడి న్యాయం"  అన్నాడు కేశవయ్య. మరి ముసలి ఏనుగుకి ఆస్తి మొత్తం రాసి ఇవ్వాలి అనడం మాత్రం న్యాయమా..! కేశవయ్యా.. అంటూ అక్కడికి వచ్చాడు రామారావు. ఇదంతా ఆయన ఉపాయమే అని అర్థమై,  తన తప్పు తెలుసుకొని,ఏనుగు  ధర ఎంత ఉందో అంత మాత్రమే డబ్బును సోమయ్య నుంచి తీసుకెళ్లాడు కేశవయ్య. కాబట్టి ఏ ఒక్కరు అత్యాశకు పోకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: