మంచిమాట: ఉద్దేశం మంచిదైతే అందరూ మిత్రులే..

Divya

మనిషికి ఆశ, ద్వేషం, కోపం ఇతరుల పట్ల అసూయ ఉన్నప్పుడు మనిషిలో ఉన్న మంచి తనం పోతుంది. అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇతరులు బాగుపడితే , ఓర్వలేక కఠినంగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాదు ఇతరులతో మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన కూడా బాగుండాలి. ఎంతటి శత్రువైన అతని పట్ల ప్రేమాభిమానాలు పెంచుకున్నప్పుడే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇందుకు సంబంధించిన ఒక చిన్న కథను ఉదాహరణగా తెలుసుకుందాం..

అనగనగా రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను తెలివైనవాడు. కానీ పరమ అత్యాశ పరుడు. ఇక ఆ ఊరిలోనే రామనాథం అనే ఒక వ్యాపారి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం కలగలేదు. కానీ అక్కడ ఉన్న విలువైన వస్తువులను బుగ్గిపాలయ్యాయి. ఇంకా అప్పుడే ఇంటికి వచ్చిన రామనాథం పూజగదిలో వ్యాపారానికి కావలసిన  నాలుగు లక్షల డబ్బు పెట్టాను అంటూ తల బాదుకుంటున్నాడు.

ఇక అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య మీ ఇంట్లోని డబ్బును నేను భద్రంగా తెచ్చి ఇస్తాను. అయితే నేను కాపాడిన డబ్బులలో  నాకు కావాల్సింది నేను తీసుకొని, నాకు ఇష్టమైనది నీకు ఇస్తాను.. సరేనా..! అని అడిగాడు. అందుకు రామనాథం సరేనన్నాడు. కృష్ణయ్య చెప్పినట్లుగానే ఇంటి లోపలికి వెళ్లి డబ్బు మూట తీసుకొచ్చాడు. ఇక రామనాథం దాన్ని తీసుకోబోతుండగా,  కృష్ణయ్య అతనికి వంద రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బును భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు.

ఇక ఇది చూసిన రామనాథం ఇది అన్యాయం.. అంటూ అటకాయించారు. కృష్ణయ్య ఎదురుతిరిగాడు. ఇక ఈ విషయం పంచాయతీ వరకు వెళ్ళింది. ఇక ఇద్దరి వాదనలను విన్న పంచాయతీ పెద్ద కేశవరావు, ఓవైపు డబ్బు మూటని , మరోవైపు వందరూపాయల నోటును పెట్టమన్నాడు. పెట్టాక కృష్ణయ్య ఇందులో నీవు కోరుకుంటున్నది..నీకు కావాల్సింది.. నీకు ఇష్టమైనది.. ఈ పెద్ద మూటే కదా..! అని ప్రశ్నించాడు వూరి పెద్ద. కృష్ణయ్య అవును అన్నాడు.

అప్పుడు.." నువ్వు నీకు ఇష్టమైనది ఇస్తాను అన్నావు కాబట్టి..ఆ మూటను రామనాథం చేతికి ఇవ్వు" అని తీర్పు చెప్పాడు కేశవరావు. ఇది "అన్యాయం.. నాకు ఇష్టమైనది అంటే ,నాకు ఇష్టం వచ్చినంత ఇస్తాను.. అన్నది నా ఉద్దేశం.." అన్నాడు కృష్ణయ్య. నీ ఉద్దేశాలు మంచివైతే గొడవే లేదు కదా..! మారు మాట్లాడక చెప్పింది చెయ్.. నువ్వు సాహసవంతుడివే కానీ నీ  అత్యాశ వల్ల తప్పుదారి పడుతున్నావు ఇకనైనా మార్పు తెచ్చుకో.." అని మందలించి అక్కడి నుండి వెళ్ళిపోయారు కేశవరావు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: