మంచిమాట: ఎప్పటికైనా సహనంతోనే మంచి జరుగుతుంది..
అనగనగా ఒక ఊరిలో వీరయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన ఒక రోజు బావి దగ్గర హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటి , మాటికి బావిలోకి తొంగి చూస్తున్నాడు. అయితే అతనికి ఏమి దిక్కుతోచడం లేదు. రెండు రోజులుగా అంగడికి కూడా వెళ్లడం మానేసి, ఆ బావి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు వీరయ్య.
అంతలో అటుగా వెళుతున్న భీమయ్య అనే ఒక కూలి పని చేసుకునే వ్యక్తిని పిలిచి, నీకు వంద రూపాయలు ఇస్తాను బావిలో నీళ్ళు తోడి, పక్కనే ఉన్న బాన లో పోస్తావా..? అని అడిగాడు. భీమయ్య సరేనని బావిలో నీళ్ళు చేదతో తోడి పక్కనే ఉన్న పెద్ద బాన లో పోయడం ప్రారంభించాడు.. ఎంతసేపు నీళ్ళు తోడి పోసినా, బాన నిండడం లేదు ..ఏమైంది అని పరిశీలించి చూడగా..ఆ బానకు పెద్ద పెద్ద చిల్లులు ఉన్నాయి . చిల్లుల నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్ళిపోతున్నాయి. దాంతో కోపం వచ్చి భీమయ్య చిల్లుపడిన బానను నింపమంటావా..? నీకు నేను వెర్రి వాడిలాగా కనబడుతున్నానా ..? అని తిట్టి పని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఈసారి వీరయ్య రామయ్య అనే మరో వ్యక్తిని పిలిచి, బావిలో నీళ్ళు తోడి బానలో పోస్తే వంద రూపాయలు ఇస్తాను అన్నాడు. రామయ్య సరేనని చెప్పి , నీళ్ళు తోడి బానలో పోయసాగాడు. ఎన్ని నీళ్లు పోసిన బాన నిండడం లేదు . చిల్లు నుంచి చెట్లకు నీళ్లు వెళ్లిపోతున్నాయి. ఆ విషయం గమనించి రామయ్య కూడా యజమాని వద్దనే వరకు.. నీళ్లు తోడితే సరిపోతుంది కదా అనుకున్నాడు.. ఇక వంద రూపాయలు వస్తాయి కదా..! అనుకుని ఆపకుండా నీళ్లు తోడ సాగాడు రామయ్య. ఇక మధ్యాహ్నానికి బావిలో ఉన్న నీళ్లు అయిపోయాయి.. మట్టి కనబడసాగింది. ఆ మట్టిలో చంద్రహారం బయటపడింది.
అప్పుడు వీరయ్య రామయ్య తో పొరపాటున బావిలో చంద్రహారం పడిపోయింది . దీనికోసమే నీళ్ళు తోడమన్నాను అని సంతోషించి , రామయ్యకు 200 రూపాయలు ఇచ్చి పంపించాడు.