మంచిమాట: త్యాగం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి..

Divya
ఒకరోజు శివానందుడు అనే వ్యక్తి అరణ్య మార్గంలో వస్తుండగా, ఒక రాక్షసుడు అతనికి ఎదురు వచ్చి. ఓయి మానవుడా..! నేను చాలా ఆకలితో ఉన్నాను..నేను, నిన్ను తినేస్తాను.. అన్నాడు.. శివా నందుడు చేతులు జోడించి, ఓ రాక్షసోత్తమా..! నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. ఇది ఇంటిలో ఇచ్చి , మరలా వచ్చి , నీకు ఆహారంగా మారగలను అని అన్నాడు. అందుకు రాక్షసుడు వెళ్లి త్వరగా రా..! అన్నాడు .
వేగంగా ఇంటికి వెళ్లి, తన భార్య చేతికి నగలు ఇచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు.. నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానంద  తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి , నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని అన్నాడు.
శివానంద వచ్చి కుమారుని వదిలేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ ఇలా అంటూ  ఉండగానే దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి ,నేను శివానంద తండ్రి ని, ముందు నన్ను తిని వాళ్ళను  వదిలేయి అన్నాడు. ఇంతలోనే శివానంద భార్య వచ్చి భర్తను, కొడుకును కోల్పోయి ..నేను జీవించలేను.. నన్ను తిను అన్నది. ఈ లోపే శివానంద కూతురు వచ్చి ఈ అనర్థాలకు మూలం నేను.. నాకు నగలు తేవడానికి వెళ్ళిన నాన్న నీ కంట పడ్డాడు. వాళ్ళను వదిలేయ్ ..నన్ను తిను అని అన్నది.
వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడి గా మారిపోయాడు. ఇక శాపం వల్ల రాక్షసుడిగా మారినట్లు వారితో తెలిపాడు. మీ వల్ల నాకు శాపవిమోచనం కలిగింది . కాబట్టి మీకు సకల సంపదలను ఇస్తున్నాను  తీసుకోండి అని, వారికి ఇచ్చి  అదృశ్యమయ్యాడు ఆ గంధర్వుడు..
చూసారు కదా..! త్యాగం వల్ల ఎప్పటికైనా మంచి ఫలితమే లభిస్తుందని గుర్తించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: