సెటైర్ : పేపర్లు ... ఛానెళ్లు వద్దోయ్ ! బతికుంటే ఏ యూట్యూబో ... వెబ్ సైటో ఉందిగా ..?

మంచో చెడో ... కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించాలో ఆ స్థాయిలో వణికిస్తోంది. ప్రపంచ మానవాళికి ఇది పెద్ద గుణపాఠం నేర్పుతుంది. ఈ కష్టకాలంలో ఎవరి భవిష్యత్తు ఏంటో అర్థం అయ్యేలా చేసింది. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ కు చిన్న, పెద్ద, పేద, రాజు, బంటు ఇలా ఏ భేదం లేకుండా అందరిని సమానంగా భయపెడుతోంది. ముఖ్యంగా మీడియా రంగంలో పని చేసే వారికి ఈ కరోనా కళ్లు తెరిపించింది. అసలే ఒడిదుడుకుల్లో ఉన్న రంగానికి ఈ ఈ కరోనా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంగతి చెప్పుకుంటే... ఎంతోమంది ఈ కరోనా ఎఫెక్ట్ కారణంగా ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. మరికొంత మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

"జర్నలిస్టు మిత్రులారా క్వారంటైన్ సెంటర్లకు, కరోనా హాస్పిటల్ కి ఎవరు వెళ్లకండి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు కరోనా విషయం సోకిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఈ మహమ్మారి సోకింది. జర్నలిస్ట్ కి ఏమైనా అయితే ఏ ప్రభుత్వం, యాజమాన్యం స్పందించదు. ఇప్పటి వరకు అన్ని వర్గాలకు, ప్రభుత్వాలు ప్యాకేజీలు ప్రకటించాయి. జర్నలిస్టులకు మాత్రం ప్రత్యేకంగా ఏమీ ప్రకటించలేదు. ప్రకటిస్తారని ఆశ కూడా లేదు. కావున కారోనాకు గురికాకుండా  జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం" అంటూ సోషల్ మీడియాలో, జర్నలిస్టుల వాట్సాప్ గ్రూప్ లలో ఈ మెసేజ్ చక్కెర్లు కొడుతోంది.

 

జర్నలిస్టులు కరోనాకు అతీతులు ఏమి కాదు కదా. ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ, ఎవరిని పడితే వారిని కలుస్తూ, అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇప్పటికీ జర్నలిస్టులు, కెమెరామెన్ లు పని చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, అనేక మంది జర్నలిస్టులు, కెమెరామెన్ లకు ఈ కరోనా వైరస్ సోకిన వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో నూ అనేక మంది జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ సోకిన వార్తలు రావడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పుడు వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చే వారు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంతో పోలిస్తే ఇప్పుడు జర్నలిజం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 

 


యాజమాన్యాల ప్రాధాన్యతను, అవసరాలను బట్టి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు జర్నలిస్టుల బతుకులు అంటే వలస కూలీలకు ఎక్కువ, ఉపాధి కూలీలకు తక్కువ అన్నట్టు పరిస్థితి తయారైంది. పైకి చెప్పకపోయినా, వారి కుటుంబాలు పోషించడమే గగనమై పోతోంది. సమాజంలో గొప్పగా బతికేస్తున్నట్టుగా కనిపిస్తున్నా, జీతాలు మాత్రం అంతంత మాత్రమే. ఇప్పుడు కరోనా కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది అయితే, కొత్తగా ఈ జబ్బును అంటించుకుంటున్నవారు మరికొంతమంది. మరి కొంతమందిని యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించకపోయినా, వారి జీతాల్లో కోతలు విధించారు.

 


 అసలు మీడియా ఎప్పటి నుంచో సంక్షోభంలో ఉన్నా, ఇప్పుడు అది మరీ ఎక్కువైంది. ముఖ్యంగా దినపత్రికలు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీటిల్లో పనిచేస్తున్న వారి బతుకు కుక్కలు చింపిన విస్తరిలా మారుతోంది. ఎందుకంటే మీడియా అనేది ఒక వ్యసనం. ఆ రంగంలో అడుగుపెట్టిన వారు మళ్ళీ వేరే వృత్తుల్లో కి వెళ్లలేరు. అందుకే పత్రిక యాజమాన్యాలకు జర్నలిస్ట్ లు అంటే అంత చులకన భావం. పైకి మాత్రం జర్నలిజం, దాని విలువలు గురించి యాజమాన్యాలు గొప్పగా చెబుతూ, లోపల మాత్రం ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ కరోనా కంటే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగూ మీడియా రంగంలో ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఈ కరోనా వైరస్ కు సంబంధించిన వార్తల కవరేజ్ లో జాగ్రత్తగా దూరం దూరంగా ఉండకపోతే ... ఈ విషయంలో జాగ్రత్తగా మసులుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.

 


 ఒకవేళ ఆ జబ్బు కనుక అంటుకుంటే.. జర్నలిస్టులు, వారి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరమే. వారిని ఆదుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు, వారు పనిచేస్తున్న పత్రిక, ఛానల్ యాజమాన్యం ఏవీ ముందుకు వచ్చే పరిస్థితి ప్రస్తుత రోజుల్లో లేదు. కరోనా  పుణ్యమా అంటూ ఈ విషయం ఇప్పుడు జర్నలిస్టులందరికీ బాగా తెలిసొచ్చింది. అందుకే  అనవసర హీరోయిజం ప్రదర్శించి... అనవసర రోగాలు అంటించుకునే బదులు వాటికి దూరంగా జాగ్రత్తగా అంటే మంచిది. అసలు బతికి ఉంటే ఏ యూట్యూబ్ ఛానలో , ఏ వెబ్ సైట్ లోనూ వార్తలు రాసుకుంటూ బ్రతికేయొచ్చు. కానీ, ఇలా దయాదాక్షిణ్యాలు లేని యాజమాన్యాల కోసం ఇప్పుడు పరిస్థితుల్లో అనవసర రిస్క్ లు చేయడం అనవసరం. ఎందుకంటే కరోనా కంటే డేంజర్ గా ఇప్పుడు మీడియా యాజమాన్యాలు తయారయ్యాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: