హెరాల్డ్ సెటైర్ : అదే మా ''సెంద్రం'' సారు సీఎం గా ఉంటేనా ..? ఇయన్నీ జరిగేవిగా
ఏమి కరోనానో ... ఏం రాజకీయమో తెలియదు కానీ... పొద్దున్న లెత్తే చాలు సావదొబ్బుతున్నారు. అదిగో కరోనా చూడండి నాట్యం చేసేస్తోంది. ఆ అధికార పార్టీ వొళ్ళు కళ్లప్పగించి చూస్తున్నారే కానీ కరోనా వైరస్ ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టి... పెట్టిలో పెట్టి తాళం వేయలేకపోతున్నారు. ఎందుకండి బాబు ఈ జగన్ ...? అసలు ఆంధ్రా సీఎంగా ఉన్నది. అసలు మా బాబోరు ఈ పాటికి ఏపీ సీఎంగా ఉండి ఉంటేనా ఏం జరిగేదో తెలుసా ..? అద్భుతాలు ఎన్నో జరిగిపోయి ఉండేవి. కరోనాతో కర్రా బిళ్లా ఆడేసుకుని ఉండేవాడు. ఏపీలో కరోనా కట్టడిపై ప్రపంచానికే పాటలు చెప్పేవాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా బాబోరి ఫోన్ కోసం ఎదురుచూపులు చూసి ఉండేవాడు. చైనా వాడు బాబు గారి కాళ్ళు పట్టుకుని మరీ క్షమించమని వేడుకునేవాడు. ప్రపంచం అంతా రిలాక్స్ అయిపోయి ఉండేది. కానీ ఈ జగన్ కు ఏమీ చేతకావడంలేదు.
అసలు పావలా పనికి పది రూపాయల ప్రచారం ఎలా చేసుకోవాలో కూడా ఈయన గారికి తెలియడంలేదు. ఎన్ని పథకాలు పెడతేనేమి, ప్రజలకు కష్ట నష్టాలు రాకుండా చూస్తే ఏంటయ్యా ..? ప్రచారం చేసుకోవడం రావడం లేదు కదా ..? అదే మా బాబోరు సీఎం గా ఉంటే ఎవరెవరు ఎలా స్పందించి ఉండేవారో తెలుసా ..? కంటికి కనిపించని శత్రువుతో బాబోరు యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా అంటూ చిరకాల దోస్తీ పవన్ కళ్యాణ్ మద్దతు పలికేవాడు. అవసరమైతే బాబు గారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టేవాడు. సోషల్ మీడియాలోనూ బాబు గారికి మద్దతు పలకలంటూ సందేశం ఇచ్చేవాడు.
ఇక మా సినబాబు గారు అయితే నా సామి రంగా ... నాన్నగారు అప్పట్లో దోమలపై దండయాత్ర చేశారు.. ఎలుకలపై దండయాత్ర చేశారు. ఇప్పుడు కంటికి కనిపించని కరోనా తోనూ దండయాత్ర చేస్తున్నారు అంటూ అదేపనిగా నత్తి నత్తిగా... ముద్దు ముద్దుగా చెప్పి ఉండేవారు. మరో మాలోకం నాయకుడు బీరు తాగితే కరోనా రాదు అని చెప్పేసేవాడు. అంతేనా ఆగండాగండి... అసలు సిసలైన మా పసుపు మీడియా బ్రేకింగ్ లు ఇలా ఉండేవిగా...
కరోనాపై బాబు ఆగ్రహం ?
కరోనాపై కత్తి యుద్ధం చేసిన బాబోరు !
గిలగిల్లాడుతూ ఇండియా బోర్డర్ దాటేసిన కరోనా !
ఇంకెప్పుడూ భారత్ లోకి, అస్సలు ఏపీలోకి రాను అంటూ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కరోనా ?
ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాబు గారి సలహాలు ?
కరోనా పై తాను చేసిన కరాటీ గురించి చెప్పిన బాబు ..! ఆశ్చర్యపోయిన ట్రంప్.
ఇదిగో ఇలా ఉండేవి వార్తలు. కానీ ఇవేమి జగన్ కు తెల్వడం లేదు. దేశంలోనే ఏపీని ఆదర్శంగా నిలుపుతున్నా ప్రయోజనం ఏంటి ? డప్పు కొట్టే మీడియా గొట్టాలు మా బాబు గారు చేతుల్లో ఉండగా ..!