సెటైర్ : బీకాంలో ఫిజిక్స్ .. బాబు గారిలో ఎథిక్స్ ! ఉంటది ఉంటది ఎందుకుండదు ?

నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా ? మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా ? బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదా ? ఆయన గారి లో ఎథిక్స్ ఉంటాయా ? అంటే ఉంటాయ్ ఉంటాయ్ ఎందుకుండవ్ అనే మేధావులు ఉన్న గొప్ప పార్టీకి అధ్యక్షుడి మాటలు చూస్తుంటే నవ్వాలో ... నవ్వుతూ ఏడవాలో , ఏడుస్తూ నవ్వుతూ ఆయన చెప్పినదానికి తప్పట్లు కొట్టాలో తెలియని పరిస్థితి ఆ పార్టీ నేతలది కూడా ? అసలు ఎక్కడ ఏమి చెప్పాలో .. అసలు చెప్పొచ్చో లేదో .. తాను చెప్పేది పచ్చి అబద్ధమే కాదు, నవ్వులపాలవుతామని తెలిసినా ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ పెద్దమనిషి చెప్పే మాటలు పొలిటికల్ కామెడీని పండిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఘనకార్యం జరిగినా అది నా గొప్పతనమే అని చెప్పుకునే గొప్ప మనిషి . కంప్యూటర్ కనిపెట్టింది నేనే , దేశంలో సెల్ ఫోన్ తెచ్చింది నేనే, అన్నీ నేనే నేనే అంటూ కలవాట్లు పడుతూ ప్రజలతో చివాట్లు తినడం బాగా అలవాటు అయిపొయింది. 

 

ఏడు పదుల వయస్సు మీద పడినా ఇప్పటికీ హుందాగా రాజకీయం చేయడం మాత్రం నేర్చుకోలేదు అనే విమర్శలు వస్తున్నా, కనీసం మారడం కాదు కదా మారేందుకు కూడా ప్రయత్నించలేదు. గ్రాఫిక్స్ లో రాజధానిని కట్టినా, ఇదే రాజధాని అని భ్రమలు కల్పించినా, ఆహా ఓహో అని భజన చేసే మీడియా గొట్టాలు ఉన్నప్పుడు ఆయనకేమి లోటు ? అసలే ప్రధాన మంత్రులను డిసైడ్ చేసిన చరిత్ర  ఉంది. పోనీలే వయస్సు పైబడింది కదా ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా అని వదిలేద్దామా అంటే ..? రోజు రోజుకూ డప్పు కొట్టుకోవడం మరీ ఎక్కువయ్యింది. అసలే ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో కృష్ణ రామా అనుకుంటూ కూర్చోకుండా ఈ కరోనా వాక్సిన్ తయారు చేయించిన ఈయన గారి కబుర్లు చూస్తుంటే నవ్వురాక మానదు. 

 


తాను ఓ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేశానని, అందులో కొనసాగుతున్న భారత్ బయో టెక్ ఈ వాక్సిన్ ని కనిపెట్టింది అని, తాను ఆ కంపెనీ యజమానితో మాట్లాడాను అని గొప్పగా చెప్పుకొచ్చారు. అసలు ఈ వాక్సిన్ తయారు అయ్యింది అంటే అది నా గొప్పతనమేనని, మీరంతా చిటికెలు వేసి నాకు సన్మానం చేయాలి అన్నట్టుగా ఆయన గారి బిల్డప్ మాములుగా లేదు. అసలు ఆయన్ను అలా వదిలేస్తే ...  అసలు ఈ కరోనా వైరస్ ను తయారు చేసింది కూడా నేనే అని చెప్పినా చెప్తాడు. 


  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: