హెరాల్డ్ సెటైర్ :  జగన్ దెబ్బకు చంద్రబాబులో కొత్త అలవాటు మొదలైందా ?

Vijaya
మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడును జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ మామూలుగా తగల్లేదు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబును కలవాలన్నా, మాట్లాడాలన్నా వాళ్ళకి ఓస్ధాయుండాలి.  మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలకే చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం దొరికేది కాదు. కాబట్టి ద్వితీయశ్రేణి నేతలు, మామూలు కార్యకర్తల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు. అలాంటిది సీన్ రివర్సయిపోయింది. చంద్రబాబే పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. ద్వితీయ శ్రేణి నేతల పుట్టినరోజులకు జన్మదిన శుభాకాక్షంలు చెబుతున్నాడు ట్విట్టర్ వేదికగా. గతంలో అయితే ఎవరు ఇటువంటి విషయాలను చంద్రబాబు నుండి ఊహించింది లేదు.

జగన్ అధికారంలోకి రాగానే అక్రమ నిర్మాణమైన ’ప్రజావేదిక’ను కూల్చేసిన విషయం తెలిసిందే. కూల్చివేత నిర్ణయం బయటకు రాగానే చంద్రబాబు, చినబాబు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియా కూడా జగన్ పై ఎంతగా బురదచల్లిందో అందరూ చూసిందే. అక్రమ కట్టడాన్ని కూల్చేయాలన్న నిర్ణయాన్ని చాలా గట్టిగానే వ్యతిరేకించారు. సరే ఇక్కడున్నది జగన్ కాబట్టి ఎవరెంతగా వ్యతిరేకించినా లెక్క చేయకుండా కూల్చి వేయించేశాడు. దాంతో తనను కలవటానికి ప్రజలు, సమస్యలతో  బాధితుల ప్రజావేదికకు వచ్చేవారంటూ చంద్రబాబు పెద్ద కలరింగే ఇచ్చాడు. నిజానికి కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక దగ్గరకు మామూలు జనాలను చంద్రబాబు రానిచ్చింది లేదు.

సెక్యురిటి కారణం చెప్పి, వాహనాల ట్రాఫిక్ ఇబ్బందులను చెప్పి పోలీసులు కరకట్టకు దూరంగానే పార్టీలోని ద్వితీయశ్రేణినేతలతో పాటు కార్యకర్తలు,  మామూలు జనాలను ఆపేసిన విషయం అందరికీ తెలిసిందే. అంటే అధికారంలో ఉంటే చంద్రబాబు వ్యవహారశైలి ఎలాగుంటుంది అనేందుకు  ప్రజావేదికే ఓ నిదర్శనం. మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకు కూడా అపాయిట్మెంట్ ఇచ్చి కలవకుండా వాళ్ళను వెనక్కి తిప్పిపంపేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇటువంటివి అనుభవంలోకి వచ్చిన నేతలు ఇపుడు రివర్సులో నడుస్తున్న చంద్రబాబు వ్యవహారం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఓటమి చంద్రబాబులో ఇంతటి మార్పు తెచ్చిందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.

మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపిలతో పాటు నేతల పుట్టినరోజంటూ తెలిస్తే చాలు వెంటనే  చంద్రబాబు, చినబాబు ట్విట్టర్ ఖాతాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న గ్రీటింగ్స్ కనబడుతున్నాయి. వాళ్ళ ఫొటోలు ఎలాగూ పార్టీ దగ్గరుంటున్నాయి కాబట్టి గతంలో తమతో తీయించుకున్న ఫొటోలను లేకపోతే వాళ్ళు సింగిలుగా ఉన్న ఫొటోలతోనో శుభాకాంక్షలు చెబుతున్నారు.  సరే ఈ వ్యవహారం ఇలా ఎంతకాలం కంటిన్యు అవుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఓడిపోయినా వెంటనే చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు గుర్తుకువచ్చేస్తారు. అధికారంలోకి రాగానే మళ్ళీ వ్యవహారం మామూలైపోతాయి. పైగా అవసరం అనగానే కార్యకర్తలకు చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి మాట్లాడేస్తున్నాడు. నిజానికి ఈ పద్దతి చంద్రబాబులో మొదటినుండి ఉండుంటే బాగుండేదని నేతలు అనుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబుపై ఓటమి ప్రభావం బాగా పడినట్లుగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: