హెరాల్డ్ సెటైర్ : పవన్ మనసులో ఏముందో..అయోమయంలో జనసేన

Vijaya
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనసులో ఏముందో అర్ధంకాక జనసైన్యం యావత్తు అయోమయంలో పడిపోతోంది. అధికార, ప్రధాన ప్రతిపక్ష ఎంఎల్ఏలు రాజీనామాలు చేయరని తెలిసే వాళ్ళు రాజీనామాలు చేయాలని కోరినట్లున్నాడు. లేకపోతే నిజంగానే వాళ్ళు రాజీనామాలు చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయని అనుకునే రాజీనామాలు డిమాండ్ చేశాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకవేళ పవన్ డిమాండ్ చేసినట్లు కాకుండా ఒక్క తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు మాత్రమే రాజీనామాలు చేస్తే అపుడేమవుతుంది ?  పవన్ స్టాండ్ ఏమిటి ? అనేదే ఎవరికీ అర్ధం కావటం లేదు. నిజానికి అమరావతి తాజా రాజకీయంలో పవన్ కు అసలు ఎటువంటి పాత్ర లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిందే ఒక ఎంఎల్ఏ. ఆ ఒక్క ఎంఎల్ఏ కూడా పార్టీటో టచ్ లో ఉండటం లేదు. పవన్ కు ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ కు సంబంధం లేదన్నట్లే అనిపిస్తోంది.



కాబట్టి పవన్ చెబితే రాపాక రాజీనామా చేసే ముచ్చట కూడా కనబడటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా రాపాక తన నియోజకవర్గం రాజోలులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాడు. కాబట్టి రాపాకతో రాజీనామా చేయించటం పవన్ వల్లకాదు. సో ఈ విషయం వరకు క్లారిటి వచ్చేసింది. మరి పవన్ ఎందుకు ఇంతగా ఎగిరెగిరి పడుతున్నాడు . కొంపదీసి ఉప ఎన్నికలు వచ్చేస్తే  ఎక్కడినుండైనా పోటి చేయాలని అనుకుంటున్నాడో ఏమిటో అర్ధం కావటం లేదు. అప్పట్లో రాష్ట్రంలో సేఫ్ నియోజకవర్గాలేవో సర్వే చేయించి మరీ భీమవరం, గాజువాకల్లో పోటి చేశాడు. అంత గట్టిగా సర్వే చేసి సామాజికవర్గాల జనాభాతో సహా సర్వేలు చేయించి ఆచితూచి పోటి చేస్తేనే రెండు చోట్లా ఓడిపోయాడు. మరిలాంటి సమయంలో పోటి చేస్తాడా ?



పవన్ డిమాండ్ చేసినట్లుగా వైసిపి ఎంఎల్ఏలు అయితే రాజీనామాలు చేసే అవకాశం లేదు. మరి టిడిపి పరిస్ధితేమిటి ? తన ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించేంత ధైర్యం చంద్రబాబుకుందా ? రాజీనామాలు చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచేంత సత్తా ఉందా అన్నదే డౌటనుమానం. వైసిపి-టిడిపి మధ్య స్ట్రైట్ ఫైట్ అంటే అదో లెక్క. కానీ మధ్యలో బిజెపి-జనసేన పార్టీలతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఉన్నాయి కాదా. మరి ఆ పార్టీలు ఏమి చేస్తాయి ?  ఒకవైపు అధికార పార్టీ అభ్యర్ధులు మరోవైపు ప్రతిపక్షాల అభ్యర్ధులు పోటి చేస్తే అపుడు టిడిపి అభ్యర్ధులకు గెలిచే అవకాశాలు ఎంతుంటాయి ?  ఓట్లు చీలిపోతే సహజంగా అధికార పార్టీ అభ్యర్ధులకే కదా అడ్వాంటేజ్.  ఇవన్నీ చంద్రబాబు, పవన్ కు తెలీకుండానే రాజీనామాలు అడుగుతున్నారా అన్నది ఇప్పటికైతే  మిలియన్ డాలర్డ ప్రశ్నలే.



సరే ఎవరి గోల ఎలాగున్నా ఉప ఎన్నికలంటూ వస్తే  పవన్ ఏమి చేయబోతున్నాడన్నదే సస్పెన్సుగా మారింది. మూడు రోజుల క్రితమే జగన్ ప్రతిపాదనపై పవన్ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది.  ఆ సమావేశంలో రాజీనామాల అంశం ప్రస్తావనకు వచ్చిందే కానీ ఉపఎన్నికలు వస్తే జనసేన పాత్ర ఏమిటనే  అంశంపై చర్చించలేదు.  ఈ మొత్తం ఎపిసోడ్ లో  రాజీనామాల కోసం పవన్ డిమాండ్ చేశాడు కానీ మిత్రపక్షం బిజెపి మాత్రం ఏమీ మాట్లాడలేదు. మరి జనసేన పోటి చేయాలని అనుకుంటే బిజెపి అంగీకరిస్తుందా ? బిజెపి కూడా ఉప ఎన్నికలు వస్తే పోటికి సై అంటుందా ? అంతే అనుమానాలే. మొత్తానికి  ఉపఎన్నికలు వస్తే పవన్ ఎక్కడి నుండి పోటి చేస్తాడు ? పోటి చేస్తే గెలుస్తాడా ? అన్న విషయాల్లో చర్చలు మాత్రం జోరుగా సాగుతోంది. చూద్దాం ఏమి జరుగుతుందో .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: