సెటైర్ : మా మీడియా గురించి మీకు ఇప్పుడు తెలిసిందా ? మాకు ఎప్పుడో తెలుసన్నాయ్

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు.. తినగ తినగ వేము తీయగనుండు.. చూడగా చూడగా, చదవగా చదవగా మా మీడియాలో సొల్లు కబుర్లు ఉండును... అందులో రాజకీయ ప్రయోజనములు ఉండును... కుల ఆరాధన ఉండును.. కడుపు మంట ఉండును. లోకమంతా పచ్చగా ఉండును... లోకులు ఈ వ్యవహారాలపై పక పక నవ్వినా దులుపుకు వెళ్ళును. ఇదంతా సర్వ సాధారణమేనని చెప్పుకుని మరింతగా రెచ్చిపోయిచుండును. అసలు ఎక్కడి నుంచో వచ్చిన ఐఐఎమ్ అహ్మదాబాద్ ఏపీలో మీడియా గురించి పెద్ద రీసెర్చ్ చేసి తేల్చేసింది. ఏపీలో మీడియా నారద పాత్ర పోషిస్తూ అనవసర గొడవలూ సృష్టిస్తోంది అన్నట్టుగా తేల్చేసింది. రెండు రోజుల క్రితమే అహ్మదాబాద్ ఐఐఎం తమ నివేదికను ఆ జగనుడికి అందించేసింది.


అసలు ఏపీలో అవినీతి తీవ్ర స్థాయిలో పెరిగిపోతూ వస్తోంది అనేది ఆ జగన్ కు ఉన్న పెద్ద అనుమానం. అసలు ఇదంతా ఆ చంద్రబాబు అండ్ కో పెంచి పోషించారు అనేది జగన్ కు ఉన్నపెద్ద అనుమానం. అందుకే ఈ సంగతేంటో తేల్చండయ్యా అంటూ ఆ జగన్ కాస్తా అహ్మదాబాద్ ఐఐఎం తో ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళు మొత్తం ఏపీ అంతా తిరిగి ఎన్నో సర్వేలు, పరిశీలనలు చేసి కొన్ని విషయాలను బయటపెట్టింది. అసలు ఈ మీడియా ఉంది చూశారూ పెద్ద విధ్వంసకర పాత్రనే పోషిస్తోంది అంటూ పెద్ద నివేదికను ఆ జగన్ చేతిలో పెట్టేసింది.

అంతేనా అసలు మీడియానే ఎన్నో గొడవలకు కారణం కాబట్టి దాన్ని పరిపాలన వ్యవహారాల్లో కలగజేసుకోకుండా దూరంగా పెట్టయ్య బాబు జగన్ అంటూ, ఓ సిఫార్సు చేసిపెట్టింది. అసలు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయంలో అయినా మీడియానే తమ సొంత అభిప్రాయాలను జోడించి రకరకాలైన రుచికరమైన కథనాలను వండి వార్చేస్తుందయ్యా బాబూ, వాళ్ళ వల్లే ప్రభుత్వ అధికారులు నానా ఇబ్బందులూ పడిపోతున్నారు అంటూ జగన్ కు అసలు విషయం చెప్పేసింది.  అసలు ఈ మీడియా వాళ్ళు ఇంకెన్ని యవ్వారాలు చేస్తున్నారో తెలుసుకోవాలంటే ప్రతి ప్రభుత్వ ఆఫీసు దగ్గరా సీసీ కెమెరాలు పెట్టండయ్యా అంటూ సిపార్సులు చేసింది. అసలు మా మీడియా మైకుల గురించి ఈ అహ్మదాబాద్ ఐఐఎం వాళ్ళు చెప్పాలా ..? మాకు తెలియదా ? అసలు వీళ్ళ గురించి మీకు ఇప్పుడు తెలిసిందేమో మాకు ఎప్పుడో తెలుసన్నాయ్ ! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: