హెరాల్డ్ సెటైర్ : నెక్స్ట్ వికెట్ దేవినేనిదేనా ? తొందరలోనే ఖాయమంటున్నారే

Vijaya
తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ విధాలుగా ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పట్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న అనేక మందిలో ప్రస్తుతానికి ఓ ముగ్గురు సీనియర్ నేతలు అరెస్టయ్యారు. కొందరి అవినీతి ఆరోపణలపై ముందుగా ప్రభుత్వం ఓ కమిటితో విచారణ చేయిస్తుంది. తర్వాత సిట్ విచారణ జరుగుతుంది. ఆ తర్వాత విజిలెన్స్ కమిటి లేకపోతే ఏసిబితో విచారణ చేయిస్తుంది. ఫైనల్ గా ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్ళని అరెస్టులు చేసింది. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్టు విషయంలో జరిగిందిదే. అవినీతి ఆరోపణలపై అచ్చెన్న అరెస్టయ్యాడు. జేసి ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ ముసుగులో చేసిన అక్రమాలు, రికార్డుల ట్యాంపరింగ్ లాంటి అనేక ఆరోపణలు రుజువ్వవటంతో అరెస్టయ్యాడు. ఇక కొల్లు ఏమో హత్య కేసులో ఆరోపణలతో అరెస్టయ్యాడు.



ఇంకా చాలామందే అరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. తాజాగా ఈ జాబితాలో మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా చేరబోతున్నట్లు సమాచారం.  ఐదేళ్ళపాటు జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేనిపై చాలా ఆరోపణలే ఉన్నాయి. అయితే కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణాజిల్లాలో అనేక ఘాట్లను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. ఘాట్ల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఖర్చులు చేసినా ఏది కూడా నాణ్యతతో లేవన్నది వాస్తవం. పైగా అప్పటి పనులన్నింటినీ టెండర్ల రూపంలో కాకుండా కేవలం నామినేషన్ల మీదే ఇచ్చేశారన్నది ప్రధాన ఆరోపణ. అవన్నీ కూడా తనకు కావాల్సిన వారికే దేవినేని కాంట్రాక్టులు ఇచ్చుకున్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. ఇపుడు అవే ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.



మొదటి నుండి ప్రభుత్వం టార్గెట్లో దేవినేని ఉన్నాడన్నది వాస్తవం. ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిపైన కూడా దేవినేని నోరుపారేసుకుంటున్న విషయాలు అందరు చూస్తున్నదే. అవసరం ఉన్నా లేకపోయినా జగన్ను పదే పదే దేవినేని టార్గెట్ చేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. అధికారంలో ఉన్నపుడు దేవినేని చేసిన అవినీతికి ప్రభుత్వం ఇప్పటికే ప్రాధమికంగా సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. అంటే ప్రాధమిక సాక్ష్యాలు సేకరించిన తర్వాతే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కాబట్టి వీలైనంత తొందరలోనే విజిలెన్స్ విచారణను పూర్తిచేయించి దేవినేని పైన యాక్షన్ తీసుకోవటానికి రంగం సిద్ధమవుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టిడిపి అధికారంలో ఉన్నపుడు జగన్ కు వ్యతిరేకంగా చాలామంది మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కళ్ళు మూసుకుపోయి వ్యవహరించారు. జగన్ ఏ విషయం ప్రస్తావించినా వీళ్ళు మాత్రం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసుకునే విరుచుకుపడేవారు. అవసరం లేకపోయినా ఎంత వీలుంటే అంతా జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వీళ్ళల్లో అచ్చెన్న, జేసి సోదరులు, దేవినేని లాంటి అనేకమంది ఉన్నారు. వ్యక్తిగత కక్ష అన్న పద్దతిలో కాకుండా అప్పట్లో జరిగిన అవినీతి అనే పద్దతిలో ఇపుడు ప్రభుత్వం వీళ్ళందరిపై యాక్షన్ మొదలుపెట్టింది. కాబట్టి ప్రభుత్వం వరస చూస్తుంటే తొందరలోనే దేవినేని అరెస్టు కూడా ఖాయమనే అనిపిస్తోంది. చూద్దాం విజిలెన్స్ విచారణలో ఏమి తేలుతుందో.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: