హెరాల్డ్ సెటైర్ : ఏమ్మాట్లాడిందో ఈమెకైనా అర్ధమైందా ? ఇంత అయోమయమా ?

Vijaya
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి మొదటిసారి ఓ దినప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వివాదమై కూర్చుంది. తన ఇంటర్వ్యూని జాగ్రత్తగా గమనిస్తే అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలన్న బలమైన కోరిక కనబడుతుంది. ఈ విషయాన్ని పురంధేశ్వరి ఏమీ దాచుకోలేదు కూడా. అమరావతే రాజధానిగా కంటిన్యు చేయాలని డిమాండ్ చేసినట్లు ఈనాడులో బ్యానర్ ఐటమ్ గా అచ్చేశారు. అయితే  ఇదే అమరావతి విషయంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ సంగతిని మరచిపోయినట్లుంది. ఏపి రాజధాని విషయంలో తమకేమీ పాత్ర లేదని పదే పదే కేంద్రప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత కూడా పురంధేశ్వరి అమరావతే రాజధానిగా కంటిన్యు చేయాలని డిమాండ్ చేయటమేంటో ?




పురంధేశ్వరి ఇంటర్వ్యూని గమనిస్తే చంద్రబాబునాయుడు, వామపక్షాలు, జనసేన+ఎల్లోమీడియా ఇంతకాలంగా  చేస్తున్న డిమాండ్ నే తన మాటల్లో చెప్పినట్లుగా ఉంది. మరి ఈనాడు దినపత్రిక ఇంటర్వ్యూలో ఏమడిగిందో ? పురంధేశ్వరి ఏమి చెప్పారో ? ఇంటర్వ్యూ పేరుతో ఏమి ప్రచురించారో మరి. మొత్తంమీద పురంధేశ్వరితో అమరావతికి ఎల్లోమీడియా జై కొట్టించినట్లే అర్ధమైపోతోంది. ఈమె ఇంటర్వ్యూను చూస్తే కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ కే కాదు స్వయంగా పార్టీ మొన్నటి ఎన్నికల సమయంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోకు కూడా వ్యతిరేకంగానే ఉంది.




మొన్నటి ఎన్నికల సమయంలో స్వయంగా బిజెపినే హైకోర్టును రాయలసీమ జిల్లా అయిన కర్నూలులోనే ఏర్పాటు చేయాలంటు చేసిన డిమాండ్ ను పురంధేశ్వరి మరచిపోయినట్లుంది. రాయలసీమలోనే ఎక్కడో ఓ చోట తాత్కాలిక అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. సెక్రటేరియట్ తో పాటు మరికొన్ని శాఖలకు భవనాలు కూడా రాయలసీమలోనే నిర్మించాలని బిజెపి డిమాండ్ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాయలసీమను ఎనిమిది జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కూడా బిజెపి నేతలు చేసిన డిమాండ్ బహుశా పురంధేశ్వరికి తెలీదేమో.  ఒకవైపు పార్టీ చేసిన డిమాండ్లపై అవగాహన లేకుండా మరోవైపు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్లను కూడా పట్టించుకోకుండా కొత్తగా అపాయింటైన ప్రధాన కార్యదర్శి మాట్లాడటమే విచిత్రంగా ఉంది.




ఈమె ఇంటర్వ్యూ వచ్చిందో లేదో వెంటనే పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. వాళ్ళతో పాటు నెటిజన్లు కూడా మండిపోతున్నారు. రాజధానితో పాటు మొత్తం అధికార కేంద్రాన్ని అమరావతిలోనే ఏర్పాటు చేస్తే మరి మిగిలిన ప్రాంతాల మాటేమిటి ? అంటూ నిలదీస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపి దారుణంగా నష్టపోవటానికి ప్రధాన కారణమే అధికార, పాలనా కేంద్రీకరణ కాదా ? అంటూ నెటిజన్లు పురంధేశ్వరిని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో రాష్ట్ర అభివృద్ధి మొత్తాన్ని రాజధాని పేరుతో ఒకేచోట కేంద్రీకృతం చేయటం వల్ల జరిగిన నష్టం ఏమిటో తెలిసికూడా మళ్ళీ మొత్తం అమరావతిలోనే ఉండాలని పురంధేశ్వరి చెప్పటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.  ఆమె పేరుతో అచ్చయిన ఇంటర్వ్యూలోని మాటలు మరి పురంధేశ్వరే చెప్పిందో లేకపోతే ఆమెతో చెప్పించారో ముందు తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: