సెటైర్ : ఏంటేంటి ? కాంగ్రెస్ కు టీడీపీ పోటీ ఇవ్వబోతోందా ?
పూర్తిగా తెలుగుదేశం పార్టీని పక్కకు గెంటేసి, ఆ పార్టీ స్థానంలో కూర్చునేందుకు సిద్ధమైపోయింది. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, పోటీపడేది మేమిద్దరమే అన్నట్లుగా వైసిపి బీజేపీలు ఇప్పుడు రాష్ట్రంలో హడావుడి చేస్తున్నారు. మరి ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నారయా అంటే, తీరిగ్గా, హైదరాబాదులో విలాసవంతంగా కట్టుకున్న భవంతిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బాబుగారి అంతటి మేధావి, ముందు చూపు ఉన్న నాయకుడే ఇక్కడ లేనప్పుడు మేమెందుకు ఇక్కడ ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ తో జట్టు కట్టడానికి రెడీ అయిపోయి క్యూల్లో నిల్చున్నారు.
ఒకరు కాదు, ఇద్దరు కాదు రోజుకో వందలమంది నాయకులు బై బై బాబు అంటూ టాటా చెప్పేస్తూ ఉండడంతో, ఎక్కడో కాలిపోతోంది. అయినా కానీ, దానిని బయటకు కనిపించకుండా కవర్ చేస్తూ, జూమ్ లో మీటింగులు పెట్టేస్తూ, పార్టీని వదలకండ్రా బాబు, నా మాట వినండి, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ అంటూ మొత్తుకుంటున్నా, అస్సలు ఎవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరు. మళ్లీ ఎన్నికలు వస్తే, అసలు పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా అనే ప్రశ్న ఎప్పటి నుంచే ఆ పార్టీ నాయకుల్లోనే కాదు స్వయంగా చంద్రబాబులోనూ ఉన్న పెద్ద డౌట్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో ఎలా అయ్యిందో ఇప్పుడు అదే పరిస్థితి తమకు వస్తుందనే భయం వారిలో ఎక్కువ కనిపిస్తోంది. దాన్ని బయటపడనీయకుండా బ్రహ్మాండంగా కవర్ చేసేస్తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతటి వీర ప్రతాపం చూపించిందో ఇప్పుడు టిడిపి పరిస్థితి అలాగే ఉంది. 2024 లో ఎన్నికలు వచ్చినా, బాబు గారి జ్యోతిష్యం ప్రకారం 2022 లో జమిలి ఎన్నికలు వచ్చినా, వైసిపితో పోటీ పక్కన పెడితే కాంగ్రెస్ తో పోటీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఎంత ప్రతాపం చూపించిందో, అంతే స్థాయిలో ప్రతాపం చూపించేలా కనిపిస్తోంది. అంటే ముందు ముందు కాంగ్రెస్ తో టీడీపీకి కష్టాలేనన్నమాట.