హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు గాలి తీసేసిన బీజేపీ, వైసీపీ
చంద్రబాబునాయుడు యూటర్న్ రాజకీయాలపై బీజేపీ, వైసీపీ నేతలు గాలి తీసేశారు. రఫేల్ యుద్ధ విమానాల పనితీరుపై తాజాగా చంద్రబాబు చేసిన ట్వీట్ ఆధారంగా బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి విపరీతంగా ట్రోల్ చేశారు. చంద్రబాబు యూ టర్న్ రాజకీయాలను తమ ట్విట్టర్ వేదికలో ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా వీళ్ళద్దరు చేసిన కామెంట్లు ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికలకు ముందు అంటే సరిగ్గా ఫిబ్రవరి 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఉద్దేశించి చంద్రబాబు పెద్ద ఆరోపణ చేశారు. అదేమిటంటే రఫేల్ యుద్ధ విమానాల్లో రూ. 59 వేల కోట్ల కుంభకోణం జరిగిందని. కుంభకోణానికి ప్రధానమంత్రి కార్యాలయమే కేంద్ర బిందువుగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. నిజాన్ని ఎక్కువ కాలం కప్పిపుచ్చలేరంటూ మోడికి చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీచేశారు.
సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో మోడి రెండోసారి బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో ఏపిలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. దాంతో తనకు బద్ధ శతృవు జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో అధికారంలోకి రావటంతో పాటు కేంద్రంలో రెండోసారి మోడినే ప్రధాని కావటంతో చంద్రబాబుకు దిక్కుతోచలేదు. వీళ్ళద్దరితో తనకు ఎక్కడ ఇబ్బందులు మొదలవుతాయో అన్న టెన్షన్ పెరిగిపోయింది. జగన్ తో సయోధ్య చేసుకోవటం కన్నా కేంద్రంలో మోడితో సయోధ్య చేసుకోవటమే అవసరగమని గ్రహించాడు చంద్రబాబు. అందుకనే అప్పటి నుండి మోడికి మళ్ళీ దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే అవసరం ఉన్నా లేకపోయినా అడిగినా అడగకపోయినా కేంద్రానికి మద్దతు ఇస్తున్నాడు. మోడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.
ఈ నేపధ్యంలోనే రఫేల్ యుద్ధ విమానాల సామర్ధ్యంపై తాజాగా అంటే అక్టోబర్ 8వ తేదీన ప్రశంసలు గుప్పించాడు. తాను అధికారంలో ఉన్నపుడేమో రక్షణ రంగంలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేశాడు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మోడి ప్రాపకం కోసం రఫేల్ యుద్ధ విమానాల కోనుగోలు పొగుడుతున్నాడు. దేశం గర్వించతగ్గ యుద్ధ విమానం రఫేల్ అంటూ ప్రశంసించటం విచిత్రమే. అప్పుడైనా ఇప్పుడైనీ రఫేల్ యుద్ధ విమానాల సామర్ధ్యాన్ని గురించి చంద్రబాబు ఏమీ కామెంట్ చేయలేదు. కాకపోతే అప్పట్లో భారీ కుంభకోణానికి కారణమైన రఫేల్ విమానాలపై ఇపుడు ఏమీ మాట్లాడకుండా అంతా బ్రహ్మాండమంటు పొగడ్తలతో ముంచెత్తటమే విచిత్రం.
ఇదే విషయాన్ని విష్ణు, విజయసాయి తమ ట్విట్టర్లో ప్రస్తావించారు. తనను తాను పాతాళంలోకి గిరాటేసుకోవటంలో చంద్రబాబును మించినోళ్ళుండరంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు మనస్తత్వం ఎలాగుంటుంది, ప్రతిపక్షంలోకి ఉంటే ఎలా మారిపోతుందనే విషయంపైనే వీళ్ళద్దరి చంద్రబాబు గాలి తీసేశారు. ఇంకా ఎన్నేళ్ళు యూ టర్న్ లు తీసుకుంటావు చంద్రబాబు అంటూ విష్ణు ట్విట్లో నిలదీయటం గమనార్హం. ఇదే పద్దతిలో విజయసాయి కూడా చంద్రబాబును ప్రశ్నించారు. మొత్తానికి చంద్రబాబు మీద ఆరోపణలన్నా, విమర్శలన్నా ఇంతకాలం ఒక్క విజయసాయి మాత్రమే దూకుడు కనిపించేవాడు. ఇపుడు ఎంపికి విష్ణు కూడా తోడైనట్లే కనిపిస్తోంది. ఒక్కళ్ళ దాడులనే తట్టుకోలేకపోతున్న చంద్రబాబు ఇపుడు ఇద్దరు కలిసి దాడులు చేస్తే ఇంకేమన్నా ఉందా ?