ఏది ఏమైనా జనసేన పార్టీ పెట్టి పవన్ పెద్ద సంచలనం సృష్టించేస్తున్నారు. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఇప్పుడు సంచలనం మీద సంచలనం సృష్టిస్తూ సంచలనాలకు మారు పేరుగా మారి పోతున్నారు. ఏపీలో జనసేన పార్టీ పెట్టి 2014లో పోటీకి దూరంగా ఉండటంతో, తమది ఎన్నికల్లో పోటీ చేయడానికి పెట్టిన పార్టీ కాదని, ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ మాత్రమేనని జనసైనికులు సరిపెట్టుకున్నారు. సైకిల్ పార్టీకి, కమలం గుర్తుకు ఓటు వేయమని పవన్ చెప్పగానే జనసైనికులు ఆ రెండు పార్టీల నాయకుల కంటే ఎక్కువగా ప్రచారంలోకి దిగిపోయి వారిని గట్టెక్కించేశారు. ఆ తరువాత మనసు మార్చుకున్న పవన్ .. తాము ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటే, ప్రశ్నగానే మిగిలి పోతామని, ఎవరెవరో అధికారాన్ని చేపట్టి మనల్ని ప్రశ్నించేలా చేస్తారని, అందుకే ఎవరికీ ఆ ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా మనమే అధికారం చేపడితే పోలే అనుకుంటూ ఎన్నికల రణరంగంలోకి దూకేశారు.
2019లో రాష్ట్రమంతా పోటీ చేసినా, కేవలం ఒకే ఒక్క సీటును ఇచ్చి సర్దుకో అన్నారు. అప్పట్నుంచి జనసేన లో ఏదో నిరుత్సాహం అలుముకుంటూ, మధ్యలో బీజేపీతో పొత్తు కూడా దొరకడంతో, కాస్త ఉపశమనం పొందిన జనసేన అధినేత ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండడం, సినిమాలు ఆకర్షించడం ఇలా ఎన్నో జరిగిపోయాయి. తాను ఉంటున్న హైదరాబాదులో ఖాళీగా ఉంటే కిక్ ఏముందని , గ్రేటర్ ఎన్నికలు ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించి, ఏపీలో పొత్తు పెట్టుకున్నా బీజేపీ వాళ్లకు తెలంగాణలో షాక్ కలిగే విధంగా చేశారు. అయ్యబాబోయ్ పవన్ గ్రేటర్ లోకి కూడా దూకేశాడు, మన పని అయిపోయింది అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఈ జోష్ ఇలా ఉన్న సమయంలో అకస్మాత్తుగా తూచ్ గ్రేటర్ నుంచి తప్పుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చారు.
బిజెపి నేతలు నా దగ్గరకు వచ్చి బతిమిలాడు కోవడంతో, పోనీలే అని ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నాము అని ప్రకటించి తన త్యాగ మనసును చాటుకున్నారు. ఇక్కడ త్యాగం చేస్తే బీజేపీ వాళ్ళు ఏపీ లో తనను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారనే అతి తెలివైన నిర్ణయం తీసుకున్నా రు. అసలు పవన్ ఎప్పటిలాగే మధ్యలోనే వదిలేస్తాడు అని కొంత మందికి తెలిసినా, మరికొంతమంది మాత్రం భారీగా సొమ్ము ఖర్చు పెట్టి మరీ నామినేషన్ దాఖలు చేసిన వారు.... వెంటనే ఆ నామినేషన్ లు వెనక్కి తీసుకోండి అబ్బాయిలు అంటూ ఉసూరుమనిపించారు. మా పవన్ ఎప్పుడూ ఇంతే అంటూ ఒకటే బాధలో ఉన్నారు.