హెరాల్డ్ సెటైర్ : గ్రేటర్ నుండి టీడీపీ నూరుశాతం వాష్ ఔట్ అయినట్లేనా ?

Vijaya

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ సంపూర్ణంగా వాష్ ఔటైపోయింది.  గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో టీడీపీ 106 డివిజన్లలో పోటీ చేసింది. పోటీ చేసిన వాటిల్లో ఒక్కటంటే ఒక్క డివిజన్లో కూడా గెలవలేకపోయింది. కనీసం ఏ డివిజన్లో కూడా తన ప్రత్యర్ధులకు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోవటమే విచిత్రంగా ఉంది. తాజా ఫలితాలతో తెలంగాణాలో టీడీపీ పరిస్దితి ఏమిటన్నది అందరికీ బాగా అర్ధమైపోయింది. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికలంటేనే మినీ తెలంగాణా ఎన్నికలని అర్ధం. యావత్ తెలంగాణా రాష్ట్రంలోని అన్నీ జిల్లాల ప్రజలకు గ్రేటర్ తో ప్రత్యక్ష సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి గ్రేటర్లో జరిగిన ఓటింగ్ సరళిని బట్టే రాష్ట్రంలోని పార్టీల పరిస్ధితులు ఆధారపడుంటాయి. ఇపుడొచ్చిన ఫలితాల సరళిని బట్టి రేపు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికల ఫలితాలు ఇలాగే ఉంటాయని కచ్చితంగా చెప్పేందుకు లేదు. అయితే ఈ ఓటింగ్, ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా పార్టీల పరిస్దితి ఎలాగ ఉంటుందనే విషయమై ఓ అంచనా అయితే వేయవచ్చు.




పోయిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అన్నీ డివిజన్లలోను టీడీపీ పోటీ చేస్తే గెలిచింది ఒక్క డివిజన్లో మాత్రమే. అప్పట్లో టీడీపీ యువరాజు నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు అన్నీ డివిజన్లలో అప్పట్లో లోకేష్ ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది. సరే గెలిచిన టీడీపీ కార్పొరేటర్లు తర్వాత ఏమయ్యారనేది వేరే సంగతి. అలాంటిది తాజా ఫలితాల్లో అసలు ఒక్క డివిజన్లో గెలుపు కాదు కదా కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది. విచిత్రమేమిటంటే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం ఒకవైపు అధికార టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపార్టీలు హోరా హోరీగా పోరాటం చేస్తే టీడీపీ ప్రచారం కూడా ఎక్కడా పెద్దగా కనబడలేదు. ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేయాలని తెలంగాణా నేతలకు చెప్పిన చంద్రబాబునాయుడు బీఫారాల్లో సంతకాలు చేయటానికి మాత్రమే పరిమితమైనట్లున్నారు.




నామినేషన్లు వేసిన అభ్యర్ధుల తరపున చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక్కటంటే ఒక్క డివిజన్లో కూడా ప్రచారానికి రాలేదు. హైదరాబాద్ లోనే ఉన్నా ఇంట్లోనుండి అడుగు బయటపెట్టలేదు. చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ కానీ ప్రచారం చేసినా ఫలితాల్లో పెద్దగా తేడా అయితే ఉండేది కాదనటంలో సందేహం అవసరం లేదు. ఏదేమైనా గ్రేటర్ ఫలితాలతో అర్ధమైపోయిందేమంటే తెలంగాణా సంగతిని పక్కన పెట్టేసినా గ్రేటర్లో అయితే పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని. చూస్తుంటే తెలంగాణాలోని సీనియర్ నేతల్లో ఎవరు కూడా తమ అభ్యర్ధుల విజయానికి పెద్దగా కృషి చేయాలేదనే అనిపిస్తోంది. మొత్తంమీద టీడీపీ వాష్ ఔట్ అయిపోయిందన్నది వాస్తవం. మరి దీని ప్రభావం చంద్రబాబుపై ఎలాగుంటుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: