హెరాల్డ్ సెటైర్ : వైఎస్సార్ విగ్రహమంటేనే ఎదుకు టీడీపీ ఉలిక్కిపడుతోంది ?

Vijaya
నేతలకు విగ్రహాలు పెట్టడం మనకు కొత్తేమీకాదు. మహాత్మాగాంధి, అంబేద్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీయార్, వైఎస్సార్ విగ్రహాలు లేని ఊర్లు దాదాపు ఉండవని అందరికీ తెలిసిందే. కొన్ని పథకాలకు, కొన్ని కూడళ్ళకూ ప్రముఖుల పేర్లు పెట్టడం మనకు అనుభవమే. మరలాంటపుడు తాజాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు విషయంలో చంద్రబాబుతో పాటు యావత్ టీడీపీ నేతలు ఎందుకింతగా ఉలిక్కిపడుతున్నారు ?  అన్న విషయమే ఎవరికీ అర్ధం కావటంలేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత అక్కడే 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అప్పటి నుండి చంద్రబాబు, యనమల లాంటి నేతలు ఒకటే గోల చేసేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర కాదు పోలవరం కాల్వల దగ్గర పెట్టుకోండి కావాలంటే వైఎస్సార్ విగ్రహాన్ని అంటూ తాజాగా యనమల ఎద్దేవా చేయటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి ?




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడో 1980ల్లోనే శంకుస్ధాపన జరిగినా వైఎస్ అధికారంలోకి వచ్చేంతవరకు మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. 2004లో అధికారంలోకి రాగానే పాత ఫైళ్ళకు వైఎస్సార్ దుమ్ముదులిపి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. అవసరమైన అనుమతులు తెప్పించి ప్రాజెక్టు పనులను స్పీడు పెంచారు. ప్రాజెక్టులో కీలకమైన కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. ప్రాజెక్టు పనులు మంచి ఊపుమీదున్న సమయంలో హఠాత్తుగా మరణించారు. తర్వాత పెరిగిపోయిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కారణంగా ఈ ప్రాజెక్టుపై తర్వాత సీఎంలుగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా దృష్టి పెట్టలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేంద్రం ఆదీనంలోని జాతీయ ప్రాజెక్టయిన పోలవరాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది వాస్తవం. అయిన పనులకన్నా జరిగిన ప్రచారమే చాలా ఎక్కువ. పైగా ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంలాగ వాడుకున్నారంటూ స్వయంగా నరేంద్రమోడినే ఆరోపించిన విషయం తెలిసిందే.




సరే 2019లో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రచారం చేసుకోవటం లేదుకానీ టీడీపీ హయాంలో జరిగిన పనులకన్నా ఇపుడు ఎక్కువే జరుగుతున్నాయి. దాన్నే తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు ఏమిటి నొప్పో అర్ధం కావటం లేదు. వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు చంద్రబాబు జెండాఊపి ప్రారంభించలేదా ? విజయనగరంలో తోటపల్లి ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే దాదాపు పూర్తియిపోయింది. చంద్రబాబు హయాంలో కేవలం గేట్లుపెట్టి ప్రారంభోత్సవం చేయలేదా ? ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రాజెక్టు దగ్గర వైఎస్ విగ్రహం పెడితే అందరు వైఎస్సార్+జగన్ను మాత్రమే గుర్తుంచుకుంటారనే బాధ పెరిగిపోతోంది. తానింత కష్టపడితే తనను ఎవరు గుర్తుంచుకోరనే బాధే చంద్రబాబు మాటల్లో కనబడతోంది. రాజదాని అమరావతి నిర్మాణంలో భాగంగానే నీరుకొండపై 100 అడుగుల ఎన్టీయార్ విగ్రహాన్ని పెడతామని అప్పట్లో తాను ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అమరావతి నిర్మాణంలో చిత్తశుద్ది లేకపోవటం వల్లే చివరకు రాజధాని పూర్తికాలేదు ఎన్టీయార్ విగ్రహమూ ఏర్పాటు కాలేదు. మరి అప్పట్లో ఎన్టీయార్ విగ్రహంపై వైసీపీ వాళ్ళు చెప్పని అభ్యంతరం ఇపుడు చంద్రబాబు ఎందుకు పెడుతున్నట్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: