అందరూ రోడ్డు ఎక్కేస్తున్నారు. ప్రజా పోరాటం అంటూ యాత్రలు అంటూ ..సంఘీభావం అంటూ ఏదో ఒక పేరు చెప్పి జనాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్ననే తుఫాను రైతులకు భరోసా పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు జిల్లాల్లో పర్యటించి, పార్టీ నేతల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, పట్టు పెంచుకునేందుకు సమావేశం అంటూ ఏదో హడావుడి సృష్టించారు. ఎన్నిరకాలుగా పట్టు పెంచుకోవాలో అన్ని రకాల పట్టు పెంచుకుని పార్టీలో ఉత్సాహం తీసుకువచ్చి, అదే సమయంలో జనాల్లోకి వెళ్లి ప్రభుత్వంపై తనకు ఉన్న అక్కసు మొత్తాన్ని బయటపెట్టారు.
అలాగే తిరుపతిలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా తమకు తిరుగు లేకుండా చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి నాయకులు సైతం రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి అంటూ గగ్గోలు పెడుతూ, రోడ్లపైకి వచ్చి హడావుడి చేశారు దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉంటూ ఏపీలో లేకుండా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ మాత్రం ఇంకా ఇంటిపట్టునే ఉంటూ జనాల్లోకి వచ్చేందుకు మొహమాటం పడుతున్నట్టు గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మాత్రమే పదునైన విమర్శలు చేస్తూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండడం పై పార్టీ నేతలకు కూడా మింగుడు పడడం లేదు. అసలు ఈ వయసులో లోకేష్ తండ్రి చంద్రబాబు అసెంబ్లీలో ఇరగదీసిన తీరు చూసినా, లోకేష్ ప్రవర్తనలో మార్పు వచ్చి జనం బాట పట్టక పోతే పార్టీకి పుట్టగతులు ఉండవు అని నెత్తి నోరు బాదుకుంటున్నా , లోకేష్ బాబు లో అస్సలు ఏమాత్రం చలనం కనిపించడం లేదు.
రావయ్య చిన్న బాబు చంద్రబాబుకు విశ్రాంతి కల్పించాలి అని అదేపనిగా వేడుకుంటున్నా, చిన బాబు కు కరోనా భయమో, రాజకీయ భయమో మరేదో తెలియదు కానీ, చినబాబు మాత్రం ఇల్లు కదలడం లేదు. రాష్ట్రంలో పోరాడేందుకు ఎన్నో సమస్యలు ఉన్నా చిన బాబు మాత్రం ఈ మొద్దు నిద్ర ఎందుకు అంటూ తెలుగు తమ్ముళ్లలో అభిప్రాయం వచ్చేసింది.