రాను రాను నాయకుల్లో కడుపు మంట పెరిగిపోతోంది. ఇది ఆషామాషీ కడుపు మంట కాదు. రాజకీయ కడుపు మంట. తమ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు కానీ, పార్టీలో మరే నాయకుడు తమ కంటే ఉన్నత స్థానానికి చేరకుండా ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించే నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ కడుపుమంట నాయకులు ఎక్కువగా ఉన్నారు.
ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నారు. అసలు తెలంగాణా లో కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణ పతనావస్థకు చేరడానికి మరెవరు కారణం కాదు, సొంత పార్టీలోని నాయకులే కారణం అనే విషయం అందరికీ తెలుసు. అసలు ఏ పార్టీలోనూ లేనటువంటి రాజకీయ పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నాయి. ఆ పార్టీలో సీనియర్ నాయకుల హడావుడి ఎక్కువే. ఎవరికి వారు తమను తాము గొప్ప నాయకులు అన్నట్లుగా వ్యవహరించడమే కాకుండా, అధిష్టానం దగ్గర సొంత పలుకుబడి కలిగి ఉండడంతో పార్టీలో మ రెవరిని లెక్క చేసే పరిస్థితి లేదు అన్నట్లు వ్యవహరిస్తూ, పార్టీని మరింత పతనావస్థకు తీసుకువెళ్లే విషయంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు.
తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ను ఎవరు పరిగణనలోకి తీసు కొనట్టుగా నే కనిపిస్తున్నారు. ఫలితాలు ఆ విధంగానే వస్తున్నాయి. అయినా ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వెళ్లేందుకు ఏ ఒక్కరు కృషి చేయకపోగా, కడుపు మంట రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పైన ఇదే తంతు.ఎవరో ఒకరికి పదవి వచ్చిందిలే... పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని ఊరుకోకుండా , వారికి పదవి రావడం ఏంటి అనే కడుపుమంటతోనో ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తుల కు పాల్పడుతూ, అసలు సిసలు కడుపు మంట రాజకీయానికి నిదర్శనం గా కనిపిస్తున్నారు అనే విమర్శలు మూటగట్టు కుంటున్నారు.