పంచాయితి ఎన్నికల వాయిదా విషయంలో సుప్రింకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పేసింది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ జారీచేసిన షెడ్యూల్ ప్రకారమే పంచాయితి ఎన్నికలు జరపాలని తేల్చి చెప్పేసింది. సరే ఎన్నికలు జరపాల్సిందే అని కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకవైపు ఎలాగైనా ఎన్నికలను వాయిదా వేయించాలన్న పట్టుదలతో ప్రభుత్వం మరోవైపు పోరాటం చేశాయి. ప్రభుత్వం ఎంతగా గోలపెట్టినా, ఉద్యోగసంఘాలు ఎంతగా మొత్తుకున్నా సుప్రింకోర్టు పట్టించుకోలేదు. నిజానికి ప్రభుత్వమైనా, ఉద్యోగ సంఘాల వాదనలో అయినా లాజిక్ ఉందనటంలో సందేహం లేదు. అయితే మరి ఆ లాజిక్ సుప్రింకోర్టు ధర్మాసనం ఎందుకని పట్టించుకోలేదు ? అన్నదే అనుమానంగా ఉంది.
ప్రభుత్వం అయినా, ఉద్యోగ సంఘాలైనా ఎన్నికలను రద్దు చేయమని అడగలేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి అది అయిపోగానే ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చెప్పాయంతే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గోవాలో ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించారు అక్కడి ఎన్నికల కమీషనర్. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా తాను జారీచేసిన ఎన్నికల షెడ్యూల్ ను కమీషనరే మళ్ళీ రద్దు చేసుకున్నారు. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని జారీచేసిన షెడ్యూల్ ను ఏప్రిల్ కు వాయిదా వేస్తు తాజాగా ఫ్రకటించారు. మరి ఇదే పద్దతిని ఏపిలో కూడా ఎందుకు పాటించకూడదని ప్రభుత్వం తరపున లాయర్ ముఖిల్ రోహిత్గీ వాదించినా ఉపయోగం కనబడలేదు.
ఇపుడు సుప్రింకోర్టులో చేసిన వాదననే ప్రభుత్వం ఇంతకుముందు హైకోర్టులో కూడా వినిపించింది. ఎప్పుడైతే హైకోర్టులో ప్రభుత్వ వాదన చెల్లుబాటు కాలేదో వెంటనే తన రూటును ప్రభుత్వం మార్చుకుని ఉండాలి. సుప్రింకోర్టులో ప్రభుత్వం కేసు వేయకుండా ఉద్యోగసంఘాల నేతలతోనే వేయించుంటే బాగుండేది. ఒకవేళ సుప్రింకోర్టులో కేసు ఓడిపోయినా అది ఉద్యోగసంఘాలకు మాత్రమే పరిమితమయ్యుండేది. అలా కాకుండా పాత వాదనలతోనే మళ్ళీ సుప్రింకోర్టులో కూడా ప్రభుత్వమే కేసు వేయటమంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అది కూడా హైకోర్టులో ఏ వాదన వినిపించి కేసు ఓడిపోయిందో మళ్ళీ అదే వాదనను సుప్రింకోర్టులో కూడా వినిపించటంతో కేసు పేలవంగా తయారైంది. అందుకనే సుప్రింకోర్టు ఈ కేసు మొత్తాన్ని ‘ఇగో వార్’ గా అభివర్ణించింది. మరి ఇంత పేలవంగా వాదించినపుడు కేసు గెలుస్తామని ఎలా అనుకున్నదో ప్రభుత్వం.