హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

Vijaya
 ‘నాకు కులం లేదు..నేను ఏ కులానాకి మతానికి పరిమితమైన వ్యక్తిని కాను. నన్ను కాపులకు మాత్రమే పరిమితం చేయవద్ద..నేను అందరి వాడిని’  ఇవి ఒకపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు. అయితే భవిష్యత్తులో ఇటువంటి డైలాగులు చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే తొందరలోనే కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో పవన్ భేటి కాబోతున్నారు. ఈ భేటికి మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వం వహించబోతున్నారు. చేగొండి అంటేనే నూరుశాతం కాపు నేతన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి చేగొండి కాపు సంక్షేమసంఘం ప్రతినిధులు భేటి అవ్వాలని అనుకుంటున్నట్లు పవన్ కు చెప్పగానే జనసేనాని వెంటనే ఓకే చెప్పేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో బీసీల తర్వాత అతిపెద్ద జనాభా కాపులదే. అయితే బీసీలకు లేనట్లే కాపులకు కూడా ప్రత్యేకంగా ఓ పార్టీలేదు. చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యంపార్టీని పెట్టినపుడు కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. చిరంజీవి కూడా తాను అందరి వాడిననే కలరింగ్ ఇచ్చినా చివరకు అది ఫక్తు కాపు పార్టీగా ముద్రపడిపోయింది. దాంతో మిగిలిన వాళ్ళు పార్టీకి దూరమైపోయారు. ఇదే సమయంలో కాపులు కూడా పూర్తిగా పార్టీని ఓన్ చేసుకోలేదు. అందుకనే పోటీ చేసిన నర్సాపురం, తిరుపతి రెండు నియోజకవర్గాల్లో నర్సాపురంలో ఓడిపోయారు. సొంత ఇలాకాలోనే చిరంజీవి ఓడిపోవటం అప్పట్లో సంచలనం. పార్టీ పెట్టిన కొంతకాలానికి హోలుసేలుగా కాంగ్రెస్ లో కలిపేయటంతో పీఆర్పీ ముచ్చట ముగిసిపోయింది.



చిరంజీవిని నమ్ముకుని పార్టీకి మద్దతిచ్చిన కాపుల్లో చాలామంది తర్వాత దెబ్బతిన్నారు. ఆ అనుభవంతోనే కాపుల్లో చాలామంది పవన్ కు దూరంగా ఉండిపోయారు. ఇందుకే పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయారు. అయితే మేజర్ సెక్షన్ను దూరం చేసుకుంటే రాజకీయంగా మనలేరన్న వాస్తవాన్ని పవన్ గ్రహించారట. అందుకనే కాపు నేతలతో సమావేశానికి రెడీ అయిపోయారు. ఎలాగూ కాపులు ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా పవర్ పుల్లు. బీజేపీ చీఫ్ సోమువీర్రాజుది కూడా తూర్పుగోదావరే. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంది కూడా తూర్పుగోదావరే. కాబట్టి పవన్+వీర్రాజు+ముద్రగడ+చేగొండి కలిసి కాపులను ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే అనిపిస్తోంది. అంటే పైకి ఇన్ని రోజులు ఎన్నిమాటలు చెప్పినా చివరకు పవన్ కు కాపులే దిక్కయినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: