హెరాల్డ్ సెటైర్ : రాజుగారికి కోపం వస్తే ఇలా చేస్తారా ?

Vijaya
తెలుగుదేశంపార్టీలో సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు కోపం చూసి అందరు ఆశ్చర్యపోయారు. రాజుగారికి కోపం వస్తే ఏం చేస్తారో ఇంతవరకు బహుశా ఎవరికీ అనుభవంలోకి రాలేదేమో. అందుకనే సోమవారం విజయనగరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజుగారి కోపం చూసిన వాళ్ళు భయపడిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఓ మహిళపై కోపం తెచ్చుకున్న రాజుగారు ఆమెను ఒంగబెట్టి వీపుపై పిడిగుద్దులు గుద్దేశారు.  రోడ్డు మీద రాజుగారి నిర్వాకం ఇపుడు వీడియోలు, ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ రాజుగారికి ఆమె మీద అంత కోపం ఎందుకొచ్చిందసలు ?




ఎందుకొచ్చిందంటే విషయం చాలా సింపుల్. ప్రచారం చేస్తున్న రాజుగారి మీదకు సదరు మహిళా కార్యకర్త పూలు చల్లారు. తనపైన పూలు చల్లద్దని రాజుగారు చెప్పారు. అయినా సరే రాజుగారిపై తన అభిమానాన్ని పూలు చల్లుతునే చాటుకున్నారు. తాను వద్దని వారించినా వినకుండా పూలు చల్లిన సదరు మహిళా కార్యకర్తపై రాజుగారికి ఒళ్ళు మండిపోయింది. అందుకనే గుంపులో నుండి వెళ్ళిపోయి ఆమెను పట్టుకుని, ఒంగోబెట్టి వీపుపై పిడిగుద్దులు గుద్దేశారు. రాజుగారి కోపం చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా ముందు ఆశ్చర్యపోయి తర్వాత భయపడిపోయారు.  మామూలుగా ఎవరిపైనైనా రాళ్ళు విసిరితే కోపం వస్తుంది. కానీ రాజుగారికి పూలు చల్లినా కోపం రావటానికి కారణం ఏమైనా ఉందేమో తెలీదు.




మరి రాజుగారి తాజా నిర్వాకం చూసి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏమని స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై ధౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతున్నాయని అనిత ప్రతిరోజు గొంతు చించుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. మహిళలపై అత్యాచారాలు, దాడులకు ప్రభుత్వానికి ఏమీ సంబంధం ఉండదని తెలిసి కూడా అనిత ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా ప్రతిరోజు ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగిన విషయాన్ని అనిత కన్వీనియంట్ గా మరచిపోయినట్లు నటిస్తున్నారు. మరి జనాలందరి ముందు తాజాగా రాజుగారి నిర్వాకాన్ని అనిత ఎలా సమర్ధించుకుంటారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: