హెరాల్డ్ సెటైర్ : ఆర్ధిక నేరగాళ్ళంతా బ్రిటనే ఎందుకు పారిపోతున్నారో తెలుసా ?

Vijaya
విజయామాల్యా..నీరవ్ మోడి..లలిత్ మోడి..సంజయ్ బండారి..వీళ్ళ పేర్లు వినగానే బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు మోసం చేసిన విషయం గుర్తుకొచ్చేస్తుంది. ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ బ్యాంకుల నుండి వేలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని చివరకు వాటిని ఎగ్గొట్టారు. బ్యాంకులు వాళ్ళపై చర్యలు తీసుకోవటానికి రెడీ అవ్వగానే చెప్పాపెట్టకుండా మనదేశం నుండి పారిపోయారు. నలుగురు దేశం విడిచి పారిపోయిన తేదీలు వేరైనా, సందర్భాలు వేరైనా కారణం మాత్రం ఒకటే. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నలుగురు కలిసి బ్యాంకులకు సుమారు రూ. 50 వేల కోట్ల వరకు ఎగ్గొట్టారు. వీళ్ళ నలుగురి మధ్య ఉన్న రెండో సారూప్యత ఏమిటంటే అందరు పారిపోయింది బ్రిటన్ కే.




మనదేశంలో వేల కోట్ల రూపాయలు దోచేసుకుని అందరు బ్రిటన్ కే ఎందుకు పారిపోయినట్లు ? ఈ విషయమే దేశంలోని  జనాలందరినీ ఎప్పటి నుండో వేధిస్తోంది. ఈ ప్రశ్నకు తాజాగా బ్రిటన్ లోని జర్నలిస్టులిద్దరు సమాధానం చెప్పారు. బ్రిటన్లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు డ్యానిష్ ఖాన్, రూహీఖాన్ ఓ పుస్తకాన్ని రచించారు. వీరు రచించిన పుస్తకం అచ్చంగా ఇండియా నుండి పారిపోయి బ్రిటన్ కు వచ్చేస్తున్న ఆర్ధిక నేరగాళ్ళమీదే. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ పుస్తకం రిలీజైంది. ఇందులో పై నలుగురి గురించి చాలా డీటైల్డ్ గా వివరించారట.  అంటే వీళ్ళ నలుగురే కాదులేండి ఇండియాలో ఆర్ధిక నేరాలకు పాల్పడి బ్రిటన్ లో తలదాచుకుంటున్న అనేకమంది గురించి కూడా రాశారు.




మొత్తానికి వీళ్ళు తేల్చినదేమంటే భారత్ లో ఆర్ధిక నేరగాళ్ళకు బ్రిటన్ స్వర్గధామంగా తయారైందట. కారణం ఏమిటంటే బ్రిటన్లో ఆర్ధిక నేరగాళ్ళపై కేసుల విచారణ చాలా నత్తడక నడుస్తాయట.  ఈ విషయం తెలుసుకునే ఆర్ధిక నేరగాళ్ళు భారత్ నుండి బ్రిటన్ కు నేరుగా పారిపోయి వచ్చేస్తున్నట్లు రచయితలు అభిప్రాయపడ్డారు. తమ పుస్తకంలో ఆర్ధిక నేరగాళ్ళ విచారణలకు సంబంధించిన అనేక కేసులను ఉదాహరణలుగా చెప్పారు. అంటే వీళ్ళు చెప్పిన ఉదాహరణలు చూస్తుంటే ఆర్ధిక నేరగాళ్ళపై  కోర్టుల్లో జరుగుతున్న విచారణ మనదేశంలో కన్నా అధ్వాన్నంగా ఉన్నట్లు అర్ధమైపోతోంది. భారత్-బ్రిటన్ మధ్య నేరగాళ్ళ అప్పగింతకు 1992లో ఒప్పందం జరిగింది. అంటే 30 ఏళ్ళ క్రితం ఒప్పందం జరిగితే పదుల సంఖ్యలో ఆర్ధిక నేరగాళ్ళను బ్రిటన్ మనదేశానికి అప్పగించాల్సుంది. కానీ అప్పగించింది కేవలం ఇద్దరినంటే ఇద్దరిని మాత్రమే. దీన్ని బట్టే మన ఆర్ధిక నేరగాళ్ళు బ్రిటన్ కు ఎందుకు పారిపోతున్నారో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: