హెరాల్డ్ సెటైర్ : రాజుగారు చేసుకున్న పాపమేమిటో ?

Vijaya
ఇపుడీ విషయమే అర్ధం కావటంలేదు చాలామందికి. బ్యాంకుల కన్సార్షియంను మోసం చేసిన కారణంగా నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు మీద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎంపి మీదే కాదు ఆయన కంపెనీలో వివిధ హోదాల్లో ఉన్న కుటుంబసభ్యులతో పాటు డైరెక్టర్ల మీద కూడా కూడా సీబీఐ కేసులు నమోదుచేసింది. చెన్నైలోని కొన్ని బ్యాంకుల నుండి ఎంపి తీసుకున్న భారీ అప్పుల్లో రూ. 234 కోట్లు దారిమళ్ళాయట. ఈ విషయమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యుటి జనరల్ మేనేజర్ ఫిర్యాదుతో తీగలాగితే డొంకంతా కదిలింది. ఎంపిపైన ఆర్ధికపరమైన ఆరోపణలు ఈనాటివి కావు. చాలాకాలంగా వినబడుతున్నవే. తనపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు యాక్షన్ తీసుకోకుండానే ఎంపి వ్యూహాత్మకంగా బీజేపీకి దగ్గరైనట్లు ప్రచారంలో ఉంది.



మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారయ్యారు. జగన్+పార్టీకి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ కారణంగానే ఎల్లోమీడియా కూడా ఎంపిని బాగా మోస్తోంది. అయితే ఇక్కడ ఓ విషయం అర్ధంకాలేదు. అదేమిటయ్యా అంటే ఒక్క తిరుగుబాటు ఎంపి మాత్రమే చేసుకున్నపాపం ఏమిటి అని. ఎందుకంటే వైసీపీకి దూరంగా ఉన్న ఎంపి బహిరంగంగానే బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. కమలంపార్టీని ఇంతగా భుజనా మోస్తున్నాకూడా ఎంపి+కుటుంబసభ్యులు+డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేయటంఏమిటో అర్ధం కావటంలేదు.



ఇదే విషయాన్ని టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపిలతో పోల్చి చూస్తున్నారు. ఫిరాయించిన నలుగురిలో సుజనా చౌదరి, సీఎం రమేష్ మీద కూడా సీబీఐ, ఐటి, ఈడీ ఉన్నతాధికారులు అనేకసార్లు దాడులు చేశారు. గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ పైన కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. టీడీపీలో ఉన్నపుడే సుజనా, రమేష్ పై దాడులు చేసిన సంస్ధలన్నీ బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత అసలు వాళ్ళగురించే పట్టించుకోవటంలేదు. ఫిరాయింపు ఎంపిల గురించి వదిలేసిన దర్యాప్తు సంస్ధలు మరి తిరుగుబాటు ఎంపి మీద మాత్రం కేసు పెట్టడమేంటి ? తిరుగుబాటు ఎంపి మాత్రం ఏమి పాపం చేశాడని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసిందని మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: