హెరాల్డ్ సెటైర్ : లోకేష్ అంటే జగన్ భయపడుతున్నాడట !

Vijaya
తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా ? అంటే అవుననే అంటున్నారు సీనియర్ తమ్ముళ్ళు. తిరుపతి లోక్ సభ ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 14వ తేదీన బహిరంగసభ నిర్వహించాలని జగన్ అనుకున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో చివరి నిముషంలో తన ప్రచారాన్ని జగన్ రద్దు చేసుకున్నట్లు స్వయంగా జగనే ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాయటం ద్వారా వివరించారు. ఎప్పుడైతే జగన్ పర్యటన రద్దయిందని తెలిసిందో వెంటనే నారాలోకేష్ తో పాటు యావత్ తమ్ముళ్ళంతా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు.




ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే లోకేష్ కు భయపడే జగన్ తన పర్యటనను రద్దుచేసుకున్నారట. జగన్ ఎందుకు భయపడ్డారంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రమాణం చేసే విషయంలోనట. వివేకా హత్యకేసులో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తాను తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని లోకేష్ పదే పదే చెప్పారు. అదే విషయాన్ని  ప్రమాణం చేయాలంటు జగన్ కు సవాలు విసిరారు.  ఎక్కడ ప్రచారం చేస్తున్నా వివేకా హత్యకేసునే లోకేష్ వ్యూహాత్మకంగా పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసలు తిరుపతి ఉపఎన్నికకు టీడీపీ, బీజేపీలు ప్రస్తావిస్తున్న వివేకానందరెడ్డి హత్యకేసుకు ఏరకంగాను సంబంధం లేదు.




నిజానికి వివేకా హత్యకేసును ప్రస్తావించటం ద్వారా పై పార్టీలకు పట్టుమని వందఓట్లు కూడా పడవు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా అదే విషయాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. సో, లోకేష్ సవాలును ఎక్కడ స్వీకరించాల్సొస్తోందో అన్న భయంతోనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రచారానికి రాకపోతే జగన్ కు అహంకారం పెరిగిపోయిందన్నారు. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే అహంకారం పెరిగిపోయిందన్నారు. ఇపుడు తిరుపతి ప్రచారానికి వస్తున్నారనగానే భయపడి ప్రచారానికి వస్తున్నట్లు గోలచేశారు. చివరి నిముషంలో పర్యటన రద్దు చేసుకుంటే లోకేష్ కు భయపడి ప్రచారానికి రావటం లేదంటున్నారు. మొత్తానికి జగన్ ఏమి చేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా తయారైది ప్రతిపక్షాల వ్యవహారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: