ఏదో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటమే కానీ నిజంగా అంత అనుభవం ఉన్నట్లు లేదు చంద్రబాబునాయుడుకు. ఎక్కడ అవకాశం దొరికినా దొరక్కపోతే దొరికించుకుని మరీ చీపుగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఆవువ్యాసం లాగ సందర్భం ఏదైనా తిప్పి తిప్పి మాట్లాడి చివరికు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలతోనే బురదచల్లేస్తున్నారు. తాజాగా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోలింగ్ పై చంద్రబాబు ఏకంగా కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. తిరుపతి అసెంబ్లీ పరిధిలో వేలాది దొంగఓట్లు పోలయ్యాయని చంద్రబాబు తన ఫిర్యాదులో చెప్పారు. దొంగఓట్లు వేయటానికి వచ్చారని ప్రతిపక్షాలు ఎలా చెప్పగలుగుతున్నాయో అర్ధంకావటంలేదు. దొంగ ఓట్లు వేయబోతున్నారనేందుకు ఆధారం ఏమిటో చెప్పలేదు.
క్యూలో నిలబడినపుడు ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు దొంగఓట్లు వేయటానికి వచ్చారని అనుకోవచ్చు. లేదా ఎక్కడైనా కొందరు వేసికూడా ఉండచ్చు. అంతేకానీ ఎక్కడో కల్యాణమండపాల్లో ఉన్నవారిని, బస్సులో వెళుతున్నవారిని పట్టుకుని దొంగఓట్లు వేయటానికి వచ్చారా అని పదే పదే బెదిరించి చివరకు వాళ్ళపై దొంగ ఓటర్లనే ముద్ర వేసి ప్రతిపక్షాలు నానా గోల చేస్తున్నాయి. ఊర్లు మారిపోయిన వారు, చనిపోయిన వాళ్ళు, వలస వెళ్ళిపోయిన వాళ్ళ వివరాలతో వైసీపీ నేతలు వేలాది దొంగ ఓటరుకార్డులను తయారుచేశారట. దొంగఓటరు కార్డుల తయారీకి వార్డు, గ్రామసచివాలయం వాలంటీర్లు సాయం చేశారట. చంద్రబాబు చెప్పింది విన్నతర్వాత దొంగఓట్లు తయారుచేయటం ఇంత సులభమా అని ఆశ్చర్యమేస్తోంది. బహుశా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో చంద్రబాబు ఇలాగే గెలిచారమో అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
నిజానికి చంద్రబాబు చెప్పినట్లుగా వేలాది దొంగఓట్లు వేయటం అంత ఈజీకాదు. ఎందుకంటే ఉపఎన్నికలో పోటీచేసిన పార్టీల ప్రధాన టార్గెట్ వైసీపీనే. కాబట్టి వైసీపీ అభ్యర్ధి తరపున కూర్చున్న పోలింగ్ ఏజెంట్లకు మిగిలిన పార్టీల అభ్యర్ధులు దాదాపు పూర్తి వ్యతిరేకమనే చెప్పాలి. ఒకళ్ళకు ఐదారుగురు పోలింగ్ ఏజెంట్లు కూర్చున్నచోట దొంగఓట్లు వేసుకోవటం వైసీపీకి అంత ఈజీకాదు. ఎందుకంటే ఎక్కడైనా దొంగఓట్లు వేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే మిగిలిన వాళ్ళు అడ్డుకునే అవకాశాలే ఎక్కువున్నాయి. ఎక్కడైనా దొంగఓట్లు పడినా చాలా తక్కువనే చెప్పాలి. ఇంతోటిదానికి చంద్రబాబు, బీజేపీ నేతలు నానా రచ్చ చేస్తున్నారు. అసలు దొంగఓట్లు వేసుకోవటం అన్నది ఈ ఉపఎన్నికతోనే మొదలైనట్లుగా చంద్రబాబు, వీర్రాజు ఆరోపిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి ఓటమి ఖాయమని అర్ధమైపోగానే దొంగఓట్ల పేరుతో రచ్చ చేయటంతోనే పరువు పోతోంది.