అవును 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ కుదేలైన దగ్గర నుండి పార్టీ నేతలను నడిపించే బాధ్యత నేరుగా ఎల్లోమీడియానే తీసుకున్నట్లుంది. ఎప్పుడైతే టీడీపీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతిలోకి వచ్చిందో అప్పటినుండి పార్టీ వ్యవహారాల్లో మీడియా పాత్ర పెరిగిపోయింది. అది ఇంతగా అంతగా పెరిగిపోయిన మీడియా చివరకు 2009 ప్రాంతంలో ఎల్లోమీడియాగా రూపాంతరం చెందింది. అప్పటినుండి అంటే 2014 ఎన్నికల వరకు టీడీపీ రాజకీయాల్లో ఎల్లోమీడియా పాత్ర కూడా కీలకంగా మారిపోయింది. అలాంటిది 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీ కుదేలైపోయింది. చంద్రబాబు నాయకత్వం మీద నేతల్లోనే అనుమానాలు పెరిగిపోయాయి. చంద్రబాబు మీదే అనుమానాలు పెరిగిపోయినపుడు ఇక లోకేష్ గురించి పట్టించుకునేదెవరు ?
ఈ పరిస్దితుల్లోనే టీడీపీకి ప్రచారమనే ఊపిరిలూదే బాధ్యత ఎల్లోమీడియా తీసుకుంది. టీడీపీకి ప్రచారం ఇస్తుంటేనే జనాలు పార్టీని గుర్తుపెట్టుకుంటారని ప్రాధమిక సూత్రం ఎల్లోమీడియాకు బాగా తెలుసు. అందుకనే రెండంచెల విధానాన్ని అవలంభిస్తోంది. మొదటిదేమో జగన్మోహన్ రెడ్డి బురదచల్లేయటం. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా దాన్ని జగన్ కు ముడేసి నానా రచ్చ చేసేయటం. ఇక రెండోది టీడీపీ నేతలకు రోజుల తరబడి విపరీతమైన ప్రచారం చేస్తుండటం. టీడీపీ నేతలను తమ స్టూడియోలకు పిలిపించుకుని జగన్ పై బురదచల్లించేయటం. పనిలోపనిగా జగన్ వ్యతిరేకులతో ప్రభుత్వాన్ని తిట్టించటమే టార్గెట్ గా పెట్టుకుంది.
తాజాగా వైజాగ్ లో మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ భవనాన్ని గ్రేటర్ మున్సిపల్ విశాఖ అధికారులు కూల్చేశారు. ఎప్పుడైతే భవనం కూల్చివేతలు మొదలైందో వెంటనే కక్షసాధింపంటు గోల మొదలుపెట్టేశారు. వీళ్ళ గోలను ఎల్లోమీడియా పతాకస్ధాయికి తీసుకెళిపోతోంది. నిజానికి పల్లా భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చలేదు. కేవలం అక్రమనిర్మాణాన్ని మాత్రమే కూల్చారు. పల్లా నిబంధనలను ఉల్లంఘించి పెద్దభవనాన్ని అక్రమంగా నిర్మించేశారు. టీడీపీ హయాంలో ఆయన ఎలా నిర్మించినా చెల్లిపోయింది. జగన్ అధికారంలోకి రాగానే అక్రమనిర్మాణాలు బయటపడటంతో కూల్చివేతలు జరుగుతున్నాయి. పల్లాది అక్రమనిర్మాణమన్న విషయం బయటపడకుండా ఉండేందుకు కక్షసాధింపనే కవరింగ్ ఇస్తోంది ఎల్లోమీడియా. పల్లానే కాదు సబ్బంహరి, గీతం విశ్వవిద్యాలయం, వెలగపూడి రామకృష్ణ, గంటా శ్రీనివాస్ వ్యవహారాలు కూడా ఇంతే. ఇక దూళిపాళనరేంద్ర, అచ్చెంనాయుడు, కొల్లురవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారాల గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రజలు పూర్తిగా తిరస్కరించిన నేపధ్యంలో ఎల్లోమీడియా మద్దతు కూడా లేకపోతే టీడీపీ సంగతి గోవిందా గోవిందా.