ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెది మరోదారి అనే సామెత తెలుగులో చాలా పాపులర్. దీన్ని రాజకీయాలకు అన్వయించుకుంటే యావత్ దేశంలోని రాష్ట్రాలదంతా ఒకదారైతే ఏపిలో టీడీపీది మాత్రం మరోదారి అన్నట్లుగా ఉంది యవ్వారం. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా యావత్ దేశమంతా సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రస్తుత సంక్షోభానికి నరేంద్రమోడి నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే ఆందోళనలు పెరిగిపోతోంది. శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రస్తుత పరిస్ధితిని ముందే హెచ్చరించినా అప్పట్లో మోడి పట్టించుకోలేదని ఇపుడు బయటపడింది. దాంతో జనాలంతా కేంద్రప్రభుత్వం ప్రత్యేకించి మోడి వైఖరిపై రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా హైలైట్ చేయకపోయినా అంతర్జాతీయ మీడియా మాత్రం దుమ్ముదులిపేసింది.
ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ ఇంత ఉదృతంగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే ముందుగా కేంద్రం లాక్ డౌన్ విధించకపోవటమేనట. దీనికి అనుబంధంగా టీకాల కొరత, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, సక్రమంగా అందని వైద్యసేవలు లాంటివి తోడవ్వటంతో సమస్య బాగా పెరిగిపోయింది. పైన చెప్పిన పరిస్ధితులు దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోను దర్శనమిస్తున్నాయి. అయితే తెలుగుదేశంపార్టీ నేతలు మాత్రం పైన చెప్పినవన్నీ ఒక్క ఏపిలో మాత్రమే ఉన్నట్లుగా రోజు గోల చేస్తున్నారు. టీకాలు, ఆక్సిజన్ సరపడా లేకపోవటమంటే జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్లేనట. టీకాలు, ఆక్సిజన్ అన్నవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. పై సమస్యలకు మిగిలిన రాష్ట్రాల్లో మోడిని నిందిస్తుంటే ఏపిలో మాత్రం జగనే కారణమని చంద్రబాబునాయుడు అండ్ కో రెచ్చిపోతున్నారు.
ఇదే విషయమై మంత్రి కొడాలి నాని మాట్లాడుతు టీకాలు దొరక్కపోవటానికి, ఆక్సిజన్ కొరతకు జగన్ కు ఏమి సంబంధమని నిలదీశారు. పై రెండింటి కోసం కేంద్రాన్ని నిలదీయలేని చంద్రబాబు అండ్ కో జగన్ను బాధ్యుడిని చేస్తే ఉపయోగం ఏమిటని అడిగిన ప్రశ్నకు సమాధానంలేదు. టీకాలైనా, ఆక్సిజన్ అయినా కేంద్రం పరిధిలోనే ఉంటుందని చంద్రబాబు అండ్ కో కు తెలీదా ? తెలుసు, తెలిసినా సరే జగన్ పైనే బురద చల్లేయాలి. ఎందుకంటే మోడిని నిలదీసే ధైర్యం చంద్రబాబుకుందా ? జగన్ అయితే తేరగా దొరికాడు కదా అందుకే టీకాలు, ఆక్సిజన్ కొరత తీర్చాలంటు విచిత్రంగా శనివారం టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేసింది.