అందరి ఉసురు తీస్తున్న కరోనా వైరస్ తెలుగుదేశంపార్టీకి మాత్రం ఆక్సిజన్ అందిస్తున్నట్లే ఉంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా రోగంతో కొందరు, ఆక్సిజన్ అందక మరికొందరు చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఫెయిలయ్యారని, ముఖ్యమంత్రిగా పాలనానుభం లేదని, కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ ఒకటే గోలచేస్తున్నారు. విషయం ఏదైనా చివరగా చెప్పేదేమంటే జగన్ వెంటనే రాజీనామా చేసి గద్దె దిగిపోవాలి అంతే. నిజంగా ఇపుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడ, లోకేష్ తదితరులు ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అందుకు కారణం కరోనా వైరస్సే అని చెప్పాలి.
కరోనా వైరస్సే తెలుగుదేశంపార్టీకి ఆక్సిజన్ అందిస్తోందనే అనుకోవాలి. లేకపోతే కరోనా కాలంలో జగన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేయాలన్నా, లేకపోతే జగన్ కు సంబంధం లేని అంశాల్లో బురద చల్లేయాలన్నా కరోనా కాబట్టే అవకాశం దొరుకుతోంది. ఇపుడు కరోనా వైరస్సే గనుక లేకపోతే పాపం చంద్రబాబు అండ్ కో అయినా, ఎల్లోమీడియా అయినా డీలా పడిపోయేవారే అనటంలో సందేహంలేదు. యావత్ ప్రపంచాన్ని వణికించేస్తు ఒకవైపు, రోగులకు ఆక్సిజన్ అందకుండా ఉసురు తీసేస్తు మరోవైపు కరోనా వైరస్ అల్లకల్లోలం చేసేస్తోంది. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారంటే అందుకు కరోనా వైరస్సే కారణం.
కరోనా వైరస్సే లేకపోతే జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి చంద్రబాబు, ఎల్లోమీడియాకు పెద్దగా అవకాశాలే ఉందేవికాదేమో. ఎందుకంటే రాజకీయంగా తెలుగుదేశంపార్టీ కుదేలైపోయింది. రాజకీయంగా జగన్ను ఎంతగా ఇబ్బంది పెడదామని ఎల్లోమీడియా ప్రయత్నించినా జనాలు పట్టించుకోవటమేలేదు. ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు ఉదాహరణ. పంచాయితి ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరులు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలే ఏకపక్షంగా గెలిచారు. జగన్ను ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాక అవస్తలు పడుతున్న చంద్రబాబుకు కరోనా వైరస్ బాగా అచ్చొచ్చింది. అంటే చంద్రబాబు ఆరోపణలు, విమర్శలను జనాలు నమ్ముతారని కాదు. నమ్మినా నమ్మకపోయినా జనాల్లో ఉండటానికి కరోనా వైరస్ సమస్యనైతే చంద్రబాబు వాడుకుంటున్నారు కదా.