అవును దాదాపు ఆరేళ్ళక్రితం దేశంలో సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసులో చంద్రబాబునాయుడుకు అసలు సంబంధమే లేదట. రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి కొత్తల్లోనే ఈ కేసు వెలుగుచూడటం అప్పట్లో పెద్ద సంచలనం. తెలంగాణాలో జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటును బేరం పెట్టిన విషయం ఆధారాలతో సహా బయటపడింది. రు. 5 కోట్లకు ఓటును కొనుగోలుకు బేరం మాట్లాడిన తర్వాత అడ్వాన్సుగా రు. 50 లక్షలు ఇస్తున్న సమయంలో అప్పటి టీడీపీ ఎంఎల్ఏ ఇప్పటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రత్యక్షంగా పట్టుబడింది రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ అయితే కీలకపాత్రదారులన్న ఆరోపణలపై మరో ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ, వేంనరేందర్ రెడ్డి, ఆయన కొడుకు కృష్ణకీర్తనరెడ్డి పేర్లను ఏసీబీ చార్జిషీటులో చేర్చింది.
దేశంలోనే అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అసలు పాత్రదారి చంద్రబాబునాయుడుగా చాలా ఆరోపణలే వచ్చాయి. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో విడుదల కావటం అప్పట్లో పెద్ద సంచలనం. దాంతో ఓటుకునోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణకు ఏసీబీ నోటీసిస్తే దానిపై కోర్టుకెళ్ళి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే చంద్రబాబు-స్టీఫెన్ సన్ మధ్య ఫోన్ సంభాషణల్లో గొంతు చంద్రబాబుదే అని పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించినట్లు ఏసీబీ చెప్పింది. ఆరేళ్ళ విచారణ తర్వాత సంచలన కేసులో తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. ఆ చార్జిషీటులో రేవంత్ పేరుతో పాటు సండ్ర, సెబాస్టియన్ తదితరుల పేర్లున్నాయి. కీలక పాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు పేరు లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది.
నిజానికి ఓటుకునోటు కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటులో చంద్రబాబు పేరులేదంటే ఇక కేసుకు విలువేలేదన్నట్లే. దబ్బులిచ్చిన రేవంత్, బేరం మాట్లాడిన సెబాస్టియన్, బేరానికి వేదిక ఏర్పాటుచేసిన సండ్ర, అందరిని సమన్వయం చేసిన ఉదయసింహ లాంటి వాళ్ళు కేవలం తెరపై కనిపించిన పాత్రదారులు మాత్రమే అని అందరికీ తెలుసు. తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించిన కీలక వ్యక్తి చంద్రబాబే అన్న ఆరోపణలకు కొదవేలేదు. ఇప్పటికే ఓటుకునోటు కేసంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబుదే. అలాంటిది ఈడీ చార్జిషీటులో చంద్రబాబు పేరులేదంటే చాలామంది నమ్మలేకపోతున్నారు.