పోలా.. అద్ధిరిపోలా..!: బూతులు తిట్టిన రేవంత్.. తొడగొట్టిన మల్లారెడ్డి
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో 2 రోజుల దీక్ష నిర్వహించారు.. ఈ దీక్ష ముగింపు వేదికపై రేవంత్ రెడ్డి.. మరో వివాదానికి తెర తీశారు. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి.. ఆయన అక్రమాలు అన్నీ ఇన్నీ కావంటూ.. నోటికొచ్చినట్టు మాట్లాడారు.. మల్లిగాడు.. అంటూ అసహ్యకరంగా తిట్టారు. మల్లారెడ్డి అక్రమాలపై సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే విచారణ వేయాలని.. ఆయన నిర్దోషి అని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్దమని సవాల్ విసిరారు. మల్లారెడ్డి అక్రమాల గురించి మరిన్ని నిజాలు త్వరలోనే బయటపెడతానన్నారు.
రేవంత్ రెడ్డి సవాళ్లు, విమర్శలు, ఆరోపణలతో మంత్రి మల్లారెడ్డి మరింతగా రెచ్చిపోయారు. మంత్రి మల్లారెడ్డి అంటేనే మాస్.. ఊర మాస్.. ఆయన జోరు, హుషారు అందరికీ తెలిసిందే. అలాంటి నవ్వుల మల్లారెడ్డి రేవంత్ రెడ్డి విమర్శల నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి శివతాండవం చేశారు. రేవంత్ రెడ్డిని ఆయన భాషలోనే తిట్టిపోశారు. రేవంత్ రెడ్డి బట్టెబాజ్.. అంటూ ఇంకా రాయలేని భాషలో కౌంటర్ ఇచ్చారు.
అంతేకాదు.. ఏకంగా ప్రెస్ మీట్లోనే తొడగొట్టి రేవంత్‌కు సవాల్ విసిరారు.. రేవంత్ పీసీసీకి రాజీనామా చేసి వస్తే..తాను కూడా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం రాజీనామా చేసి ఒకే చోట పోటీ చేద్దామని సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ కు రేవంత్ రెడ్డి ఏమంటారో చూడాలి.