ఏపీ రాజధానితో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారుగా..?

Chakravarthi Kalyan
ఏపీ రాజధాని అంశం.. ఇప్పుడు ఓ జోక్‌గా మారింది. ప్రత్యేకించి కేంద్రం దృష్టిలో ఇదో సిల్లీ మేటర్ గా ఫీలవుతోంది. ఏపీ రాజధాని ఏది ప్రభూ అని కేంద్రాన్ని అడిగితే ఒక్కోసారి ఒక్కో విధంగా సమాధానం ఇస్తూ.. తాను తికమకపడుతూ.. అందరినీ తికమక పెడుతోంది. ఏడాది కాలంలో ఈ విషయంలో కేంద్రం అనేక సార్లు మాట మార్చింది. మాట మార్చింది అనడం కంటే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది అని చెప్పడం కరెక్ట్ అవుతుందేమో.

అసలు కేంద్రం వరకూ ఎందుకు ఏపీలోనే ఈ కన్‌ఫ్యూజన్ ఉంది.. ఇంతకూ ఏపీ రాజధాని ఏది.. న్యాయంగా చెప్పాలంటే.. ఇంకా మూడు రాజధానుల బిల్లు అమల్లోకి రాలేదు కాబట్టి ఇంకా అమరావతే రాజధాని. కానీ ప్రభుత్వం ఆ విషయంలో ఏమాత్రం పట్టింపుతో ఉండదు. ప్రధాన కార్యాలయాలను కర్నూలుకో, విశాఖకో తరలించాలన్న దృష్టితోనే ఉంటుంది. సో.. రాష్ట్ర పౌరులకు ఏది అసలైన రాజధానో అర్థంకాని పరిస్థితి. బహుశా ఇదే గందరగోళం కూడా కేంద్రంలోని పలు శాఖలకు ఉన్నట్టుంది.

గతంలో ఓసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు.. తమ మ్యాప్‌లో అసలు ఏపికి రాజధానినే చూపించలేదు. దీంతో అప్పట్లో ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంటులో నిలదీయడంతో.. మళ్లీ మ్యాప్ మార్చి అమరావతి రాజధాని అని యాడ్ చేశారు. ఆ తర్వాత ఓ విషయంలో ఏపీ రాజధాని విశాఖ అన్నారు. ఇటీవల పెట్రో ధరల పెంపుపై లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం విషయంలో ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొన్నారు. ఈ సమాధానం ఇచ్చింది జూలైలో.. కానీ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. అంటే ఇప్పటి వరకూ దాన్ని ఎవరూ పెద్దగా చూడనట్టుంది.

ఈ అంశాన్ని నిన్న మీడియా బాగా హైలెట్ చేసింది. దీంతో.. సాయంత్రానికి మరో ప్రకటన విడుదల చేసింది కేంద్రం. పెట్రోలు, డీజిల్‌పై ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నుల విషయంలో విశాఖ పేరును ఉదాహరణగా తీసుకున్నట్లు వివరణ ఇచ్చింది. ఆ కాలమ్‌లో టైటిల్‌ పెట్టే విషయంలో రాజధాని లేదా సమాచార నగరం అని ముద్రించడంలో లోపం జరిగిందని వివరించింది. హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు... సమాచారం సేకరించిన నగరంగా పేరును ఇప్పుడు చేర్చుతున్నట్లు తెలిపింది. లోక్‌సభ సచివాలయానికి కూడా ఈ సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ తన వివరణలో పేర్కొంది. మొత్తానికి ఇలా ఏపీ కాపిటల్‌తో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: