హెరాల్డ్ సిగ్నేచర్: అక్షరం ముక్కరాని మొద్దులు.. కరోనాను ఓడించారే.. మనం తక్కువా...?
రంజుకుగా చదువుకున్నోడికన్నా.. రజకుడు మేలనే సామెత మనోళ్ల నోళ్లల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఇదే దో పాత సామెతే అనుకున్నా.. కొత్త విషయాల్లోనూ ఇదే నిజమని అనిపిస్తోంది. బయటకొస్తే.. పోతావ్ రోయ్! అని నెత్తీనోరూ బాదుకుంటున్నా.. లాఠీలతో కుమ్మేసి కిమ్మనకుండా కేసులు రాస్తున్నా.. పోలీసోళ్లు మన కు లోకువయ్యారు. మనదే పైచేయి కావాలని తహతహ లాడిపోతున్నాం. పనిలేకున్నా.. పదిరోడ్లూ చుట్టే స్తున్నాం. తీరా తెల్లారేసరికి పేపరోళ్లు.. అక్కడిన్ని కేసులు వచ్చాయి.. ఇక్కడిన్ని కేసులు వచ్చాయని రాసేసరికి నోళ్లు నొక్కుకుంటున్నాం. మళ్లీ బండి తాళం చెవుల కోసం వెతికేస్తున్నాం.
ఛీ! థూ.. బతుకు చెడా!! అని అనుకుంటూనే రోడ్డెక్కేస్తున్నాం.. పోలీసోడు కనిపించని రోడ్లు వెతుక్కుని మరీ చక్కర్లు కొట్టేస్తున్నాం. ఎవరో చెబితే కానీ.. చదువుకున్నోళ్లకు తెలకెక్కదు.. ఇటీవల తెలంగాణలో ఓ రైతు.. దొడ్లో కూర్చుని బువ్వ తింటూ.. చెప్పిన మాట గుర్తొచ్చి.. నిజమే కదా!? అనుకోవాల్సి వస్తోంది. ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా.. అంటూనే మనం వీరుల్లాగా రోడ్ల మీద తిరిగేస్తున్నాం.. అదేమంటే.. స్వతంత్ర దేశంలో ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదా? అనేస్తున్నాం. మరి చదువుకున్నోళ్లు ఇలా చేస్తే.. చదువు లేనోళ్ల మాటేంటి? తింగరబుచ్చిల పరిస్థితి ఏంటి?
డామిట్! చదువుకున్నోళ్ల కన్నా.. వాళ్లే బెటరని అనిపిస్తున్నారు. బుద్ధిగా ఇంట్లో కూర్చుని కరోనా మహ మ్మారిని కట్టడి చేస్తున్నారు. మనం సుద్ధ మొద్దులు.. చదువురానోళ్లు.. పైసాకి పనికిరారని నెత్తీనోరూ బాదుకుంటామే.. ఎక్కడి నుంచో వచ్చి మన గల్లీల్లో పనిచేస్తున్నారని నవ్విపోతామో.. వాళ్లే బీహారోళ్లు.. మనకన్నా బెటర్ అంటే నవ్వుకున్నా నష్టమేం లేదు! కరోనా భూతానికి ప్రపంచాలేం ఖర్మ.. మన దేశం కూడా ఒణుకుడు ప్రారంభించింది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలు అయితే.. ముందు బీరాలు పలికినా.. ఇప్పుడు మాత్రం కరోనాకు కాళ్ల బేరానికి రాక తప్పలేదని తెలుసుగా! పారాసిట్మాల్‌తో మన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కరోనాకు బ్రేకులు పడతాయని చెప్పుకొని.. నవ్వుల పాలయ్యారు.
ఇప్పుడు ఏకంగా అసలు విషయం తెలిసి.. నెత్తీనోరూ బాదుకుంటున్నారనుకోండి! మరి దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా.. సుద్ద మొద్దుల జాబితాలో ముందు వరుసలో ఉన్న బీహార్ మాత్రం దేశంలో కరోనా కట్టడిలో ముందుందంటే నమ్ముతారా? ఫోండి మీరు నమ్మకపోయినా.. వాళ్లకేమీ నష్టం లేదు. ఇప్పుడు దేశంలో కరోనా విజృంభణ కల్లుతాగిన కోతిలా గంతులేస్తోంది. అస్సలు మాకెలాంటి ముప్పు లేదని చెప్పిన.. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా కళ్లు తిరిగి కూలబడుతున్నాయి. నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లో కంటే అధికంగా జనాభా ఉన్న బీహార్‌లో మాత్రం పరిస్థితి ఎలా ఉండాలి? వీటికన్నా దారుణంగా ఉండాలి! ఎందుకంటే.. ఇక్కడ మనకన్నా చదువుకున్న పోటుగాళ్లు అక్కడ లేరు కాబట్టి!
నిరక్షరాస్యతలో ముందున్న బీహార్.. ఆదాయంలో తీవ్రంగా వెనుకబడి అలో లక్ష్మణా! అని అఘోరిస్తు న్న బీహార్.. కరోనా విషయంలో ధనిక రాష్ట్రాల కన్నా ఏం చేయగలదు? ఏం... తెలంగాణ కన్నా పోటు రాష్ట్రమా? ఏపీ కన్నా విజనున్న రాష్ట్రమా? లేక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కన్నా పోటుగాడా అక్కడి సీఎం నితీష్ కుమార్!! నిజానికి ఇప్పుడు వచ్చిన వార్తలు తెలియనంత వరకు బీహార్ గురించి అందరూ ఇలానే అనుకునేవారు. కానీ, బీహార్ విషయంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూసేసరికి.. అందరూ నివ్వెర పోతున్నారు. అక్కడి ప్రజలు చదువుకోకపోవచ్చు.. కానీ, వారు మన రజకుల మాదిరిగానే చాలా తెలివైనోళ్లు..!!
ఎన్నిట్లోనో.. మనం కానీ, మన దేశంలోని రాష్ట్రాలు కానీ ముందున్నా.. కరోనాపై నిర్లక్ష్యంలో మాత్రం బిహార్ చాలా చాలా వెనుకబడింది! బహుశ ఆ వెనుకబాటే దానిని, దాని ప్రజలను కాపాడేసిందట! దాదాపు పది కోట్ల పైచిలుకు జనాభా ఉన్నరాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య(పాజిటివ్) 84. మరణిం చింది ఎందరో తెలుసా? ఒక్కరంటే ఒక్కరు! ఇది నమ్మాల్సిన నిజం. దేశం మొత్తం ఎప్పుడో మార్చి 20న కళ్లు తెరిస్తే.. అక్కడి సీఎం నితీష్ కుమార్ మాత్రం మార్చి 5నే స్పందించారు. వెనువెంటనే జనసమ్మర్థా లున్న ప్రాంతాలపై నిషేధం విధించారు. అదే నెల 13న రాష్ట్రంలో స్కూళ్లు, విద్యాసంస్థలు, ప్రార్థనాయా లను బంద్ చేయించారు.
అంతేకాదు. అందరికన్నా ముందుగానే బీహార్‌లో లాక్‌డౌన్ ప్రకటించారు. ఫలితంగా ఎక్కడివక్కడ నిలిచి పోయాయి. అంతేనా.. మనోళ్లు చెబుతున్న ఢిల్లీ మర్కజ్ కేసులను ప్రత్యేకంగా చూశారు. ఢిల్లీ వెళ్లి వచ్చి నవారిని వచ్చినట్టు.. క్వారంటైన్ చేసేశారు. కనీసం ఇంటికి కూడా వెళ్లనివ్వలేదట. అంతేకాదు, చదువు తక్కువే అయినా.. ప్రజలు తమంతట తామే ఇంటికే పరిమితమయ్యారు. `నేను మీరు ఎన్నుకున్న సీఎంను చెబుతున్నాను..`` అని నితీష్ ఒక్కసారి పిలిపిచ్చేసరికి అందరూ ఇంట్లో పాముల్లా చుట్ట చుట్టేసుకుని కూర్చున్నారు. ఎంతైనా.. మనలాగా చదువుకున్నోళ్లు కాదుకదా?! అందుకే ఇప్పుడు దేశంలోనే కరోనా కంట్రోల్‌లో ఉన్న రాష్ట్రంగా బీహార్ ముందు వరుసలో నిలిచింది. ఏం చేస్తాం.. మనం చదువుకుని ఇబ్బందులు పడుతున్నాం.. వాళ్లు చదువులేకున్నా సేఫ్ అయిపోతున్నారు!!