తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?
ఇప్పుడు అమెరికాకు టెర్రరిస్టు భయం తగ్గింది.. ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భావించింది. దీంతో మరోసారి ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. బెడైన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తాలిబన్ రాజ్యం కాబోతోంది. అప్ఘానిస్తాన్ పేరు కూడా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ గా మారబోతోంది. కేవలం వారం రోజుల్లోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించేశారు. యావత్ దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు.
అన్ని వైపుల నుంచి కాబూల్ ను చుట్టుముట్టి అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు. తాలిబన్ల జోరుతో ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ బేజారెత్తిపోయారు. అష్రాఫ్ ఘనీ తనకు సన్నిహితులైన ఇద్దరు నేతలతో కలిసి దేశం వదిలి పారిపోయారు. ఆయన కజకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. షరతులేవీ విధించకుండా ప్రభుత్వం తమకు లొంగిపోవాలన్న తాలిబన్ల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించింది. కాబూల్‌కు సమీపంలోని బగ్రామ్ వైమానిక స్థావరాన్ని కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్థావరంలో తాలిబన్లు, ఐఎస్‌ఐఎస్ వంటి అనేక ఉగ్రసంస్థలకు చెందిన 5 వేల మంది ఖైదీలున్నారు. తాలిబన్‌ల దండయాత్రతో అక్కడి ప్రజలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారి గత అరాచక పాలన గుర్తు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బు తీసుకునేందుకు ఏటీఎంల ముందు బారులు తీరారు.ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఓ కల్లోల రాజ్యం.