ఇక సైన్యంలోనూ సగం.. ఓ వనితా దూసుకుపో.. ఆకాశమే హద్దుగా!

నీపాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...
గద్దర్ ఏనాడో ఆడపుట్టుకను అద్భుతంగా వర్ణించాడు..
ఎదిగినంత నిన్ను ఎదిగిస్త నమ్మా..
చదివినంత నిన్ను చదవిస్తనమ్మా..  
ఇప్పుడు ఆ పాట మళ్లీ గుర్తుకొస్తోంది.. ఎందుకంటే.. మహిళలు గర్వించే రెండు వార్తాలు ఇటీవల వినిపించాయి. స్వతంత్ర్య వేడుకల వేదిక నుంచి ఈ దేశం తలెత్తుకునే గొప్ప నిర్ణయం.. ప్రధాని మోడీ ప్రకటించారు.. ఇన్నాళ్లూ చేసిన పాపానికి పరిహారం ప్రకటించారు. ఇక నుంచి సైనిక్ స్కూళ్లలోనూ విద్యార్థినులకు ప్రవేశం ఉంటుందని ప్రకటించారు.. ఎంత గొప్ప నిర్ణయం అనే దానికన్నా.. స్వతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లకా ఈ నిర్ణయం తీసుకున్నారనిపించింది.. పోనీలే.. ఇప్పటికైనా మేలుకున్నారు కదా అనిపించింది.

అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరని ఇప్పటికే లక్షల సార్లు రుజువయ్యింది.. ఎందరో వనితలు ఈ విషయాన్ని రుజువు చేశారు. సైన్యం అయితేనేం.. మహిళలు ఎదురొడ్డి పోరాడలేరా.. పోరాడాలో వద్దో వాళ్లు నిర్ణయించలేరా.. వాళ్లు కదన రంగంలో కాలు పెట్టకూడదని నిర్ణయించడానికి మీరెవరు.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. ఇక ఇప్పుడు సైనిక పాఠశాల్లోనూ విద్యార్థినులకు స్థానం దక్కింది.

ఇది జరిగిన రెండు రోజులకే మరో గొప్ప వార్త.. సైన్యంలో శిక్షణ ఇచ్చే నేషనల్ డిఫెన్స్ అకాడమీ.. ఎన్‌డీఏ పరీక్షల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సైన్యానికి తేల్చి చెప్పింది. సైన్యంలోకి  మహిళలకు ఎందుకు ప్రవేశం కల్పించకూడదో చెప్పాలని ఈ దేశ సైన్యాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. అబ్బే.. అది మా విధాన నిర్ణయం అంటూ సైన్యం తరపు లాయర్ నసిగే సరికి.. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ విధానం లింగ వివక్ష కాదా అని సూటిగా ప్రశ్నించింది. ఎన్‌డీఏ పరీక్షలు రాసే అవకాశం అమ్మాయిలకూ ఇవ్వాలని తేల్చి చెప్పింది.
 
కొద్దిరోజుల వ్యవధిలోనే  రెండు కీలక నిర్ణయాలు.. ఇవి మహిళాసాధికారత దిశగా అడుగులేస్తాయి.. మహిళల్లో స్థైర్యం నింపుతాయి.. నేను చేస్తాను అని మహిళ ముందుకు వస్తే ఆపేందుకు మనం ఎవరం.. మహిళకు ఏది కావాలో చెప్పేందుకు మనం ఎవరం..?  
ఓ మహిళా దూసుకుపో.. ఆకాశమే హద్దుగా..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: