తిట్లే తిట్లు: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ !
రిటర్న్ గిఫ్ట్.. ఈ పదాన్ని రాజకీయాల్లో కేసీఆర్ వాడుకలోకి తెచ్చారు. చంద్రబాబుకు ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో కలకలం రేపాయి.. చర్చకు దారి తీశాయి. ఇప్పుడు అదే కేసీఆర్‌కు కూడా రిటర్న్ గిఫ్ట్ వస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ తిట్ల రూపంలో ఇస్తున్నారు. రాజకీయాల్లో పరుష పదజాలం వాడకూడదన్న ఇంగితాన్ని నేతలు పాటిస్తున్న రోజుల్లోనే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తిట్లకు తెర తీశారు.
సన్నాసులు.. దద్దమ్మలు... చవటలు.. ఇలా అలవోకగా ఇతర పార్టీల నాయకులను కేసీఆర్ తిట్టేవారు.. అవన్నీ అప్పట్లో ఉద్యమంలో కడుపుమండిన వారి మాటలుగా కొన్ని రోజులు చలామణీ అయ్యాయి. అయితే ఉద్యమ లక్ష్యం నెరవేరినా.. అధికారం చేతిలోకి వచ్చినా కేసీఆర్ భాష మారలేదు.. ఆయన నోట సన్నాసులు.. దద్దమ్మలు... చవటలు వంటి పదాలు అలవోకగా వస్తూనే ఉంటాయి. తాడి తన్నేవాడి తల తన్నేవాడు ఉంటాడన్నట్టు ఇప్పుడు కేసీఆర్ ప్రారంభించిన తిట్ల రాజకీయాల బాధ్యతను ఇప్పుడు రేవంత్ రెడ్డి నెత్తిన వేసుకున్నారు.
రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను మించిపోతున్నారు.. అరేయ్... ఒరేయ్.. ఆడు.. ఈడు.. కేటీఆర్‌గా.. మల్లిగాడు.. ఎత్తుపల్లోడు.. ఇలా తిట్లతో బాడీషేమింగ్‌ను కూడా రేవంత్ రంగరిస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ విపక్షాల నేతలను తిడుతుంటే టీఆర్ఎస్ వాళ్లు సంబరపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తిడుతుంటే కాంగ్రెస్ వాళ్లు సంబరపడుతున్నారు.. వీళ్లా మన నాయకులు అని మన ముందు తరాలు తుపుక్కున ఉమ్మేస్తాయేమో అన్న స్పృహ మాత్రం ఎవరికీ కలగడం లేదు. అదే పిటీ..