స్మరణ : ఆంధ్ర సోగ్గాడుగా 6 కోట్ల మంది హృదయాల్లో స్థానం..

Divya

ఆంధ్ర సోగ్గాడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు శోభన బాబు. ఈయన అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి - 14 - 1937న జన్మించారు. ఈయన ఎక్కువగా కుటుంబ కథా భరితమైన ,ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. అంతేకాదు చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో, అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ,ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగువారి మదిలో నిలిచిపోయాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు . వీరిది కృష్ణా జిల్లా చిన నందిగామ. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఎక్కువ ఆసక్తిని పెంచుకొని, అనతికాలంలో మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఇక డిగ్రీ వరకు విజయవాడలో తన చదువును పూర్తి చేసుకున్నాడు.


ఇక మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ ,నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్లి రావడం, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరగడం అలా చేస్తూ ఉండేవాడు. ఇక అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకుని , పొన్నలూరి బ్రదర్స్ వారు "దైవ బలం" చిత్రంలో ,రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. సినిమా సెప్టెంబర్ - 17 - 1969 న విడుదల అయింది. కానీ విజయవంతం కాలేదు. ఇక ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక ముని కుమారునిగా నటించాడు. 1960 - జూలై - 17 న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడంతో శోభన్ బాబు పేరు సినీరంగానికి పరిచయమైంది.


అప్పటికే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన శోభన్ బాబు, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, అలా గూడచారి 116,  పరమానందయ్య శిష్యుల కథ వేశానికి 1500 రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రతిజ్ఞాపాలన చిత్రంలో 750 రూపాయలు పారితోషికం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో హీరోగా నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఈయన నటించిన చిత్రాలు 1971, 1974 ,1976, 1979 లో నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డులను అందుకోగా, 1969, 1971 , 1972, 1973 ,1976 లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందాడు.

ఆ తరువాత ఎనిమిది సార్లు సినీగోయర్స్ అవార్డ్స్ తో పాటు మూడు సార్లు వంశీ బర్కిలీ అవార్డు ను కూడా పొందాడు.  అంతేకాకుండా ఈయన 1970లో నటించిన బంగారు పంజరం సినిమాకు గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డును కూడా అందించింది. ఇక ఇన్ని పేరుప్రఖ్యాతలు, ఎన్నో అవార్డులు ,ఆంధ్ర సోగ్గాడు గా పేరు సంపాదించుకున్న శోభన్ బాబు ,ఎన్నటికీ ప్రేక్షకుల మదిలో అందాల హీరోగా ఉండిపోవాలని భావించి, తన 59 వ సంవత్సరంలో నటజీవితానికి స్వస్తి చెప్పాడు. 220 కి పైగా చిత్రాలలో నటించి, 1996లో విడుదలైన హలో గురు చిత్రంతో తన 30 ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి, చెన్నైలో తన కుటుంబంతో ఆనందంగా కాలం గడిపేవాడు.ఆ తర్వాత 2008 మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల యాభై నిమిషాలకు చెన్నై లో మరణించాడు. ఈయన  మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఈయన మరణవార్త విన్న ఎంతోమంది ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: