స్మరణ : నటనకు ప్రతిరూపం ధర్మవరపు సుబ్రహ్మణ్యం..
ధర్మవరపు సుబ్రహ్మణ్యం బుల్లితెర నుండి వెండితెరకు వచ్చి, ఒక అసాధారణ వ్యక్తిగా సినీ ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన, తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే వారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే, నలుగురు పిల్లలను ఆయన తల్లే పెంచి పెద్ద చేసింది. ఇక అద్దంకిలో ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను, ఒంగోలులో ఇంటర్ సి ఎస్ ఆర్ శర్మ కళాశాలలో చదివారు. ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్య మండలితో పరిచయం ఏర్పడింది. ఇక నాటకాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్లో ఉత్తీర్ణులు కాలేక,అమ్మ బాధ చూసి మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు.
ఇక కొంతకాలం తర్వాత వ్యవసాయ పనుల్లో ఉండగా, కొందరి మిత్రుల సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. అక్కడ ఉత్తీర్ణులు అవడంతో హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్లీ నాటకాల వైపు మళ్లడంతో, ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశాడు. తరువాత దూరదర్శన్ లో తెలుగు ధారావాహిక " అనగనగా ఒక శోభ" ను ప్రారంభించారు. ఇక తర్వాత దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా "జయమ్ము నిశ్చయమ్మురా" సినిమాలో అవకాశం వచ్చింది. అలా వరుస అవకాశాలు కొట్టేశారు. మరోవైపు నటనలో తలమునకలై ఉండగానే "తోకలేని పిట్ట" అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం కూడా వహించారు . ఇక ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మరొకసారి దర్శకత్వ బాధ్యతలు జోలికి వెళ్లలేదు.
ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో తనదైన శైలిలో నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక 1989లో ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ సాంస్కృతిక మండలిలో అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. ఇక దాదాపు 75 సినిమాలలో నటించి ఒక హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇక చివరగా దిల్సుఖ్ నగర్ లోని సర్దార్ నగర్ లో తన భార్య, ఇద్దరు కుమారులతో 1979 నుండి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు . ఇక ఆరు నెలలుగా కాలేయ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 7 2013 న శనివారం రాత్రి పదిన్నర గంటలకు చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.