రహస్యం అంటే

gsr
మన ఆచార్యులలో లోకోపకారకులుగా, పరమ కారుణికులుగా ప్రసిద్దిచెందిన మహనీయులు పిళ్ళై లోకాచార్య స్వామి. వారు ఎన్నో రహస్యములను మనకు అందించారు. రహస్యం అంటే అందరూ చెప్పుకోవడం ఏంటి అని మనకు అనిపించవచ్చు. కానీ మొదట మనం రహస్యం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. రహస్యం అంటే లోన దాగి ఉన్నా, బాగా వెతికి చూస్తే తప్ప లభించని వాటిని రహస్యం అని అంటారు. అవి మనం తప్పనిసరిగా తెలుసుకోవల్సినవి, తెలుసుకుంటే మనల్ని బాగు చేసేవి. మనకు లాభాన్ని కలిగించేవి. విలువైనవి కావడంచే పైపైకి కనిపించవు. వెతికితేనే లభించేవి కనుక అవి విలువైనవి అని అంటాం. మనం బాగుపడటానికి తెల్సుకోవాల్సిన జ్ఞాన సంభందమైన విషయాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి.


శ్రీ రామాయణం ఒక మంచి గ్రంథం. మనవతా వాదం ఉన్న ప్రతి వ్యక్తికీ పరిచయం రామాయణం. కథ అందరికీ తెలుసు. అనగనగా రాముడు, రాముడి భార్య సీత, అడవికి వెళ్ళారు, అక్కడ సీతను రావణాసురుడు ఎత్తుకు పోయాడు, రాముడు కోతుల సహాయం తీసుకొని లంకను చేరి రావణాసురుడిని చంపి, సీతను తెచ్చుకున్నాడు. ఈ కథ అందరికీ తెలుసు. అయితే రామాయణాన్ని ఈ జాతి ఒక సంపదగా కాపాడుకుంటూ వస్తుంది. భక్తి సంప్రదాయాన్ని రామానుజులవారు చాలా బాగా కాపడుకుంటూ వస్తున్నారని తెలుసుకున్న ఒక రాజు, దక్షిణ దేశానికి చెందినవాడు, అతడికి ఈ సంప్రదాయం అంటే నచ్చేది కాదట. అందుకు మూలమైన రామానుజుల వారికి అపాయం తలపెట్టే ప్రయత్నం చేసాడని చరిత్ర చెబుతోంది. చివరికి ఆ రాజు తన గొంతుకు వచ్చిన రోగంతో భాదపడుతూ చనిపోయాడు కనక క్రిమి కంఠుడు అని పేరు. అట్లానే ఈ మధ్య కాలం, అంటే సుమారు 60 సంవత్సరాల క్రితం మరొక ఆయనకు అనిపించిందట, ఈ సంప్రదాయపు మూలం రామాయణం కనక దానికి అవమానం చేయాలి అని తల పెట్టిన సంఘటనలూ మన చరిత్రలో ఉన్నాయి. తరువాత ఈ విషయం తెలుసుకున్న పెద్దజీయర్ స్వామి వారు రామాయణానికి అవమానం జరిగిన వీధుల్లోనే రామాయణ పారాయణం చేసి, అనేక చోట్ల రామ క్రతువులు ఏర్పాటు చేసారు. రామాయణం కేవలం 24000 శ్లోకాలు కల చిన్ని గ్రంథం లేక ఒక చిన్ని రామ కథ అని అనుకుంటే అది ఎప్పుడో పోయుండేది. అంత కష్టపడి దాచుకోవాల్సిన అవసరం ఏంటి కనక. అట్లా ఎన్ని గ్రంథాలు కాల గర్భంలో కల్సి పోలేదు ? కానీ రామాయణం అట్లా పోలేదు. కారణం ఏంటి అంటే పైకి కనిపించే కథ మాత్రమే కాదు అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. రహస్యాలు అంటే ఎంత వెతికితే అంత విలువైన విషయాలు తెలుస్తాయి.


మన పూర్వాచార్యులు మన గ్రంథాల్లో, మన వేదాల్లో, మన పురాణాల్లో, ధర్మ శాస్త్రాల్లో మనం బాగుపడటానికి వీలయ్యే విషయాలని బాగా పరిశీలించి వెతికి పైకి తీసారు. వారు వెతికి తీసినవి జాగ్రత్తగా బద్రపరచి మనదాకా అందించారు. మన ఆచార్యులకు తెలిసినట్లుగా వేరే ఏ ఇతర సంప్రదాయాల్లో వారికి మన వంగ్మయాల గొప్పతనం బాగా తెలియదు. పది మందికి ఉపకరించేవి కనుక వాటిని అందరి దాకా తీసుకు పోవడం మన స్వరూపం.


ఆచార్యులు అందించే రహస్యాలు ఎట్లా ఉంటాయి అనేదాని గురించి ఒక కథ చెబుతారు మన పూర్వులు. ఒక రాజావారి ఆస్థానంలో రామాయణం బాగా తెలిసిన ఆచార్యులు, సంస్కృతం బాగా వచ్చిన పండితులవారు పనిచేస్తుండేవారు. రాజావారికి ఆచార్యులవారు అంటే బాగా ఇష్టం ఉండేదట. రామాయణం వినాలి అంటే ఆచార్యులవారి ద్వారానే అని అంటూ ఉండేవారట. సంస్కృత పండితులవారికి ఈ విషయం నచ్చక ఏమిటి ఆచార్యులవారి గొప్పతనం నేనూ చెప్పగలను అని రాజావారితో అన్నారట. అయితే రాజావారు ఇద్దరూ రామాయణంలో ఒక విషయాన్ని తీసుకొని చెప్పండి, ఎవరు బాగా చెబితే వారే గొప్ప అని అన్నాడట. "విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ" అనే శ్లోకం తీసుకొని పండితులవారు అర్థం చెప్పడం ప్రారంభించారు. విరాధుడు అనే రాక్షసుడిని సంహరించి శరభంగుడు అనే ఋషిని దర్శించాడు రామచంద్రుడు అని చెప్పాడు. సంస్కృతంలో అప్పుడప్పుడు అక్షరాలు సరి పోకుంటే, చందస్సుకు సరి పోయేలా, అర్థం చెడిపోకుండా కొన్ని శబ్దాలు చేరుస్తారు. అట్లా ఈ శ్లోకంలో 'హ' అనేంత ఆశ్చర్యం ఏమి లేదు అని చెప్పాడు పండితులవారు.


ఆచార్యులవారు ఆ శ్లోకాన్ని విని రత్నం లాంటి శ్లోకం తీసుకున్నావు అని తను అర్థం చెప్పడం ప్రారంభించాడు. ఈ శ్లోకంలో వాల్మీకి భగవానుడు ఎంత ఆశ్చర్య పడుతున్నాడు. రాముడు ఒక మనిషిగా మంచిగా బ్రతకటం ఎలానో చూపడానికి తాను ఎన్నో ఆచరించి చూపాడు. మహనీయులని దర్శించాలి అని మనకు చెప్పేందుకు, రాముడు తాను అడవికి వెళ్ళినప్పుడు ఋషులని దర్శించడం తన కర్తవ్యం అని అనుకొని వెళ్ళేవాడు. అట్లా తను శరభంగుడు అనే ఋషి వద్దకి వెళ్ళాడు. ఆ ఋషి మృత్యువుని కూడా తన చేతిలో పెట్టుకున్న మహనీయుడు. ఆయన ఉన్నంతకాలం ఆయన ఆశ్రమాన్ని ఏ రాక్షసుడూ ఏమి చేసేవాడు కాదట. కానీ తన తర్వాత ఆశ్రమాన్ని ఎట్లా కాపాడు కోవడం అని చింతించేవాడట. మామూలుగా పెద్దల వద్దకి వెళ్ళేప్పుడు వట్టి చేతులతో పోకూడదు అనేది నియమం. వారికి అవసరమైనదేదో ఇవ్వాలి. మామూలుగా ఋషుల వద్దకి వెళ్ళితే సమిదలు తీసుకు వెళ్ళేవారు, కానీ ఆ ఋషికి ఏమి ఇస్తే ఆనందపడుతాడు అని ఆలోచించి, వారికి కష్టం కల్గించే విరాధుడిని సంహరించి ఆ వార్తను శరభంగుడికి అర్పించాడు. అందుకు శరభంగుడు తాను ఆర్జించుకున్న పుణ్యాలని రాముడికి ఇచ్చి తన దేహాన్ని పరిత్యజించి, ఊర్థ్వలోకాని వెళ్ళాడు.  అట్లా ఇందులో ఎన్నో విషయాలు శ్రీరాముడు చూపించాడు, పెద్దలను దర్శించుకోవాలి, అట్లా వారిని దర్శించేందుకు వెళ్తే ఎదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, ఆ తీసుకుపోయేది ఏదో ఒకటి కాక వారు ఇష్టపడేది తీసుకు వెళ్ళాలి, అంతేకాక తాను అడవికి వచ్చినదే రాక్షస నిర్మూలన కనుక తన ధర్మాన్ని పాఠించాడు, అందుకే ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి ఆహా! రాముడు ఎన్ని నియమాలని చూపాడు అని ఆశ్చర్యపోతున్నాడు అని ఆచార్యులవారు అర్థం చెప్పారు. ఇందులో సామాన్య ధర్మం, రాజ ధర్మం, వైధిక ధర్మం ఇమిడి ఉన్నాయి. అట్లా పూర్వం పరం విశ్లేషించి చెప్పగలిగేవారు మన ఆచార్యులు. వీటినే రహస్యాలు అని అంటారు. ఇవి ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి.
అట్లా మన మంచి కోసం మన పూర్వ ఆచార్యులు మనవరకు అందించిన రహస్యాలను తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: