1. రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్యరక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అపుడు విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీమహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహావిష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.
2 . శిశుపాలుడితో జరిగిన ఒక యుద్ధంలో కృష్ణుడు తన చేతి వేలికి గాయం చేసుకుంటాడు. రక్తం బాగా కారుతుంటే, అక్కడే ఉన్న ద్రౌపతి తన చీరకొంగు చించి అతని వేలికి కడుతుంది. అపుడు శ్రీ క్రిష్ణుడు ఆమెను సోదరి సమానురాలిగా భావించి ఆమె కట్టిన చీర కొంగును రక్షాబంధనంగా భావించి ఆమెను తదుపరి రోజులలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి రక్షిస్తాడు.
3 . పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు.
అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది.
అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.