అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా పూజలకంటే వరలక్ష్మీ పూజించడం చాలా శ్రేష్ఠం. శ్రీహరికి ఇష్టమైన, ఆయన జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. పద్ధతులు వేరైనా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒక్కటే.
శ్లో" పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా
క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే !!
శ్రావణ మాస మంటేనే మహిళలందరికీ సందడే సందడి. మంగళగౌరీ వ్రతాలు,నోములు, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి ఇలా వరుసగా పండుగలు...
వరలక్ష్మీ వ్రత పండగ కు కావలిసిన వ్రత సామాగ్రి అనగా పూజకు తగిన పూలు,పళ్ళు,పట్టుచీరలు,రూపు, బంగారు ఆభరణములు తదితరములు సమకూర్చుకొని,వరలక్ష్మీ మాతను సుందరంగా అలంకరించి, కలశం పై చిన్న వరలక్ష్మి అమ్మవారి ప్రతిమను ఉంచి,పూలతో ,గాజులతో,బంగారు ఆభరణాలతో అలంకరించి లక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి, షోదశోపచారాలతో పూజిస్తూ వ్రతం ప్రారంభించాలి.
ముందుగా ఒక పళ్ళెములో బియ్యము పోసి,దానిపై మనము కలశము అమర్చి,పళ్ళెము ముందు తమలపాకువేసి పసుపు వినాయకుడిని చేసుకొని,మహా గణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి. సంకల్పం చెప్పుకొని,గణపతి పూజానంతరం,వరలక్ష్మీ మాత పూజ ధ్యానం,ఆవాహనం,అర్ఘ్య,పాద్య, ఆచమనీయాలు సమర్పించి,పంచామృత, శుద్ధోదకస్నానాలు సమర్పించాలి. వస్త్రయుగ్మం,ఆభరణం సమర్పించాలి.మాంగళ్యం (రూపు) సమర్పించాలి.గంధం,అక్షతలు,పూలు సమర్పించాలి.అధాంగపూజ,అష్టోత్తరశతనామావళి అక్షతలతో అమ్మను అర్చించాలి.ధూప,దీప,నైవేద్య,పానీయ,తంబూలాలు సమర్పించాలి.నీరాజనం సమర్పించాలి.మంత్రపుష్పం,దక్షిణ సమర్పించాలి. ఆత్మ ప్రదక్షిణ సమర్పించాలి.....ప్రార్ధనాపూర్వక నమస్కారం సమర్పయామి.
తోరపూజ...
తొమ్మిది సూత్రంబులు (పసుపు రాసిన దారము) గల తోరములను చేసి అమ్మవారివద్ద ఉంచి అక్షతలతో కమలాయై నమ: ప్రధమగ్రంధిం పూజయామి అంటూ నవమ గ్రంధిం వరకు పూజ చేయాలి.తోరం ముందు కలశానికి కట్టాలి. తరువాత శ్లోకం చదువుతూ కుడి చేతికి తోరం కట్టుకోవాలి.
శ్లోకం చదువుతూ అమ్మవారికి వాయనం ఇవ్వాలి.వాయనమిచ్చాక అక్షతలు తీసుకొని వ్రతకధను చదువుకోవాలి.తరువాత ముత్తైదువకు పీట వేసి అమ్మవారి ఎదురుగా కూర్ఛోబెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి చేసిన ,నైవేద్యంపెట్టిన,పిండివంటలు,శనగలు,తాంబూలం,వస్త్రములు,దక్షిణ అన్నీ ఒక పళ్ళెములో పెట్టి ఆవిడకు తోరము కట్టి, వాయనము ఇస్తూ,ఇసినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. ఆవిడ పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. వాయనమును అందుకున్నదెవరమ్మా అని అనగా ముత్తైదువ "నేనమ్మా గౌరీ దేవిని" అని అనాలి.తదుపరి పూజాక్షతలను కుటుంబీకులందరూ తమపై వేసుకొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి.
వరలక్ష్మీ వ్రతకల్పంలో ప్రతి శ్లోకం చదువుతూ పూజ చేయాలి. ఈ వ్రతమునకు 9 లేక 5 రకముల పిండి వంటలు చేయాలి.సాధారణంగా బూరెలు,పరవాన్నం,పులిహోర,ఉండ్రాళ్ళు,గారెలు లేక బజ్జీలు చేయచ్చు.ఎవరిష్టం వారిది. చలిమిడి,వడపప్పు కొద్దిగా పానకం చేసి నైవేద్యం పెట్టాలి.ఒక కొబ్బరికాయ కలశానికి, రెండవది అమ్మవారి ముందు కొట్టి నైవేద్యం సమర్పించాలి.
మనం చేసిన చలిమిడిని కుందులుగా చేసి దీపం వెలిగించి ఆ దీపం పైన గరిట పెట్టి కధ చదువుతాము.కధ పూర్తయ్యీసరికి పొగకి గరిట నల్లగా మసి పడుతుంది దానికి కొద్దిగా నెయ్యి చేర్చి ముత్తైదువులకి కాటుకగా ఇస్తాము. చుట్టుపక్కలవారిని అందరినీ తాంబూలానికి పిలిచి అందరికి పసుపు రాసి, గంధం,బొట్టు ఇచ్చి,శనగలు,తాంబూలం ఇచ్చి పెద్దవారైతే ఆశీర్వాదం తీసుకుంటాము.అతి ముఖ్యమైన విషయం ఆరోజు వీలు చూసుకొని తప్పకుండా లలితా సహస్రనామ స్తోత్రం పఠించాలి.
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్థుతే!!