నవరాత్రుల్లో ఈ నాలుగు పూజలు చెయ్యండి విజయ వైభవం మీకే స్వంతం!

నవరాత్రి పదంలో "నవ" శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవిపూజ కు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్ప బడింది. దీనినే "శరన్నవరాత్రులు" లేదా "దేవి నవరాత్రులు" అంటారు. 



నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం, అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది.  దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్న వారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం. 

సరస్వతి పూజ- నవ రాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతి దేవిని పూజించాలి. అమ్మ వారికి నైవేద్యం గా తెల్లని కుడుములు సమర్పించాలి. విద్యరూపంలో జ్ఞానం ప్రసాదించే సరస్వతి దేవి అనుగ్రహం కొరకు, లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించడం కొరకు సరస్వతి దేవిని పూజించడం ఆచారం. తద్వారా ఆమె కృపాకటాక్షాల వలన జ్ఞానం కలిగి అన్నింటా విజయం లబిస్తుంది. 

దుర్గాష్టమి - కాలచక్రం ప్రకారం ఆశ్వయుజమాసంలో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల ఆరోగ్య, ప్రాణ హాని కలిగించే అనేక దుష్టశక్తులు రభావం చూపిస్తుంటాయి.  ఈ ఋతుపరివర్తన సమయంలో విషజ్వరాలు, కఫం, దగ్గు మొదలైన ఉపద్రవాలను నివారించటానికి అనాదిగా దుర్గా పూజావిధానం ఆచరణలో ఉంది. దేవి మహాగౌరిగా దర్శనమిచ్చే రోజు. ఈ అష్టమికే మరో పేరు కాలికాష్టమి దుర్గా అష్టోత్తరం, సహస్ర నామావళి చదువుతూ అమ్మవారిని పూజించాలి. దేవికి దానిమ్మ పండ్లు, పొంగలి, పులోహోర నివేదన చెయాలి. కుజ గ్రహ దోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించడం చక్కటి పరిహారం గా చెప్పవచ్చు. 




మహర్నవమి - నవరాత్రులలో ప్రధానమైన రోజు. దేవి మహిషాసురుణ్ని వధించిన రోజు. మహిషాసురమర్దిని రూపంలో మహాశక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎరుపురంగు పూలు, జమ్మి పూలు, కనకాంబరాల తో పూజించి పొంగలి,పులిహోర, అరటి పండ్లు నివేదించడం మంచిది. 

విజయదశమి - ఆశ్వయుజమాసం శుక్లపక్షంలో వచ్చే దశమినాడు ప్రదోషకాలం విజయసమయం. సమస్తమైన కోరికలను తీర్చే ఆ తరుణం పేరు మీదుగానే దశమికి 'విజయదశమి' అని పేరు వచ్చింది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఈ రోజు ఏదైనా కొత్తవిద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈరోజు ప్రారంబిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీపూజ ఈరోజు విశేష ప్రయోజనమిస్తుంది. జమ్మిచెట్టును పూజించడం లక్ష్మీఅనుగ్రహప్రదమని పురాణాలు ఘోషిస్తున్నాయి. శమీవృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మిచెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధనస్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత వినాకునికి శమీపత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. 


జమ్మి చెట్టును ఈ క్రింది శ్లోకంతో పూజించవచ్చు

‘‘శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా, తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''


పూర్వం జమ్మిచెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. నేటికీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీవృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి సువర్ణవర్షం కురిపించే వృక్షంగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీరాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీపూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చేక్కతోనే నిర్మించారని చెబుతారు. 



శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచపాండవులు అజ్ఞాతవాసానికి సమాయత్తమయ్యే ముందు తమ అయుదాల్ని శమీచెట్టుపై దాచిపెట్టడం జరిగింది.


శమీపూజ ఎప్పటినుండి మొదలైందో తెలియదు కాని అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం అనేదానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీవృక్షపూజతో సంబంధముందని తెలుస్తుంది. అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీవృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది.


అదే విధంగా శమీపూజ చేసేందుకు భారతకథ కూడా నిదర్శనమంటారు. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించు కుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాల ను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తన్ను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమి నాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: