అబద్ధం (అసత్యం) చెప్పవచ్చట – ఆ సందర్భాలు ఏవంటే!

అసత్యం నేఱం. కాని మన హైందవ ధర్మం తన ఇతిహాసాలు, నీతిశాస్త్రాల ద్వారా కొన్నిసందర్భాల్లో అబద్ధాలాడటానికి అసత్యాలు పలకటానికి  అనుమతి ఇచ్చింది. కాని అబద్ధమాడటం ఎప్పటికైనా నేఱమే అంటూ సత్యవాక్పరిపాలనము చేసి, యశస్సును దిగంతాలకు వ్యాపింప జేసుకున్నారు సత్య హరిశ్చంద్రుడు, బలి చక్రవర్తి లాంటివారు. తమ సర్వస్వం కోల్పోయే క్రమంలో కూడా అవకాశం ఉన్నా అసత్యమాడని బలి చక్రవర్తి గురించి తెలుసుకుందాం!


వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మానభంగ మందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు
బొంకవచ్చు నఘమువొంద దధిప !!

గురువుగా… నేను నీకు నీతి చెబుతున్నాను. స్త్రీ విషయంలో, వివాహం, ప్రాణం, విత్తం, మానం, విషయంలో అసత్యం చెప్పవచ్చు. అబద్ధం ఆడినా పాపం రాదు! కనుక ఇస్తానని ఎప్పుడు అన్నానని అను, మాటలు వక్రీకరించారు అని వటువుతో పలుకు - అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ఆపటానికి శతదః  ప్రయత్నించాడు. 

కాని, బలి,  గురువుగా మీరు నాకు చెప్పవలసిన మాటలు కావివి. నేను ఆడిన మాటను తప్పను బ్రదుకవచ్చు గాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధవములైన జెడుగాక పడుగాక మాట దిరుగలేదు మానధనులు, అంటే నా ప్రాణం పోయినా పరవాలేదు, కానీ ఇచ్చిన మాట తప్పనని దానికి సిద్ధపడుతూ, వచ్చిన వాడు శ్రీమహావిష్ణువే ఐతే అంతకంటే పరమాద్భుతం ఏమున్నది.

"ఆదిన్‌ శ్రీ సతి కొప్పుపై, కాయంబు నా పాయమే" సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని స్పర్శించిన ఆ చేయి క్రిందగుట నాచేయి పైనగుట సృష్టిలో ఎప్పుడైన జరిగినదా! ఏమి అదృష్టం ఇక ఈ రాజ్యం, ఈ శరీరం అవసరమా? అంతటి కీర్తి నాకొస్తుంటే ఎలా వదులుకోను! నేను దానం ఇచ్చేస్తాను అన్నాడు.

కారే రాజులు.? రాజ్యములు గలుగవే.? యిక్కాలమున్‌ భార్గవా! ఈ భూమిని పాలించిన రాజులు ఏరి? ఎంతమంది వచ్చిపోయారు.? ఇచ్చిన శిబి చక్రవర్తి లాంటి మహ నీయులు శాశ్వతంగా కీర్తింపబడుతున్నారు. 

గురువర్యా! ఇవ్వడం గొప్ప, ఇచ్చిన మాట తప్ప లేను అని స్పష్టం చేశాడు బలిచక్రవర్తి. అంత,  శుక్రాచార్యుడు నేను ఇవ్వొద్దు అంటే నువ్వు ఇస్తానంటున్నావు నా మాట ధిక్కరించినందుకు నీ సమస్త ఐశ్వర్యం నశించి పోవుగాక అని శపించాడు.

అలా గురువు మాట తిరస్కరించి మూడడుగుల భూదానం చేయటానికి నీరువదులుతుంటే ఆ పాత్రలోకి దూరాడు శుక్రుడు. ఎంతైనా శిష్య మమకారం ఊరుకోదు కదా?'
“ఇదం నమమ” అని నీటిధార పడితేగాని దానం చేయటం కుదరదు కాబట్టి అలా చేశాడు.

నీరధారబడుగనీక యడ్డంబుగా, నేత్రుడయ్యెనతడు నీరు పడకపోవటం గమనించి ఆశ్చర్యంతో వింధ్యావళి (శిబి చక్రవర్తి భార్య) ఉండగా! వటుడు (వామనావతార శ్రీమహావిష్ణువు)  'ఉండమ్మా నేను చూస్తాను’ అని తన చేత ఉన్న దర్భతో శుక్రుడి కంటిలో గుచ్చుకునేటట్లుగా పొడిచాడు. దానితో ఒక కన్నును పోగొట్టుకుని చేసేది ఏమి లేక బయటకు వచ్చాడు శుక్రుడు. మూడడుగుల నేల ఇస్తున్నానని ధార విడిచాడు బలిచక్రవర్తి.

తాను సృష్టించిన భూమిని తానే దానం పట్టిన దృశ్యమది. ఎంతటి అపూర్వదానం బలిచక్రవర్తిది. దానికి సంతోషించి వటుడు మూడడుగులిచ్చావు కదా! నేను కొలుచు కుంటాను అంటే బలిచక్రవర్తి సరే అన్నాడు.

"ఇంతింతై వటుడింతై బ్రహ్మండ సంవర్థియై..." 
పొట్టిగా ఉన్న పిల్లవాడు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయాడు. 

"రవిబింబముపమింప బ్రహ్మాండమున్‌ నిండగన్‌..."
అలా పెరిగిన వటుడికి సృష్టి ఎలా అలంకారమయిందో చెబుతున్నాడు పోతన. సూర్యబింబమే గొడుగై, చెవిపోగై, కంఠాభరణమై, మోచేతి కంకణమై, నడముకు వడ్డాణమై, కాలికి అందైయై పాదానికి పీఠంగా మారిందని అద్భుతంగా వర్ణించాడు..

“ఒక పదంబు క్రింద నుర్వి పద్మము త్రివిక్రమమున
ఒక పాదం భూమిపై, ఇంకొక పాదం ఆకాశంపై పెట్టి 
మూడవ అడుగు ఎక్కడ అన్నాడు” వటువు రూపంలో ఉన్న విష్ణువు. 

అంత బలి ‘నూనృతంబుగాని సుడి యందు నాజిహ్వ అంటూ తన తలపై పెట్టమని అన్నాడు. దానికి వటువు సిద్ధపడగా వింధ్యావళి దు:ఖిస్తూ నా భర్త చేసిన అపరాధమేమి? విష్ణువని తెలిసినా దానం ఇచ్చేసాడు కదా! అంటున్న ఆమెతో 'అమ్మా దు:ఖించవలదు. నేను ఇంద్రునికి అతని రాజ్యం ఇస్తానని అదితికి మాట ఇచ్చాను. అతని లోకం అతనికి ఇచ్చేస్తాను. పాతాళ లోకాన్ని బలికి ఇస్తున్నాను. నా సుదర్శన చక్రం అతనిని ఎల్లవేళలా కాపాడుతుంది. అనంతరం అతనిని 'సావర్ణిమనువు' వచ్చే వేళకు ఇంద్ర పదవిలో కూర్చోబెట్టి తదుపరి ఎవరూ రాలేని వైకుంఠానికి రప్పించి నాలో ఐక్యం చేసుకుంటాను. నీవు కూడా నీ భర్తతో పాటుగా పాతాళ లోకానికి వెళ్ళు ' అని ఆమెను ఓదార్చాడు.

అద్భుత వర్తనుడగు హరి 
సద్భావితమైన విమల చరితము వినువా! 
డుద్భట విక్రముడై తుది 
మద్భాసిత లీల బొందు నుత్తమ గతులన్‌!

అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తవత్సలుడు త్రివిక్రమ స్వరూపుడైన వామన అవతారలక్ష్యానికి కారకుడు. జన్మ అంటే ఇలానే ఉండాలని అనిపించేంత అద్భుత జన్మ బలి చక్రవర్తి ది. సాక్షాత్తు పరంధామునిలో ఐక్యం అయిన దానశీలి బలిచక్రవర్తి ఔన్నత్యాన్ని చాటే ఈ ఘట్టం ఆస్తికత్వ మార్గాన్ని బలీయం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: