రంజాన్ హలీం

హలీమ్ పర్షియా నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఆ కథ ఆసక్తికరమే.. అప్పట్లో ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించే వంటకాల్లో ఓ ప్రత్యేక డిష్ గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్ధం చేయించారు. అదే హలీమ్. అలా పర్షియా నుంచి పరిచయమైన హలీం హైదరాబాద్ బిర్యానీలాగే ఇక్కడి వంటకమైంది. 
 
భారతదేశ వంటకాలకు ప్రపంచమంతా అభిమానులున్నారు. ఇక హైదరాబాద్ బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు. ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా ఒక్కసారైనా దానిని రుచి చూసి కానీ వెళ్లరు. అయితే, ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసంలో మాత్రం హైదరాబాద్ బిర్యానీ వెనక్కి జరిగి ఇంకో వంటకానికి జై కొడుతుంది. అదే హలీమ్! ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం సోదరులు సాయంత్రం దీక్ష విరమించాకా తీసుకునే ఆహరం హలీమ్. అయితే, అదిప్పుడు అందరికీ అభిమాన వంటకం అయిపొయింది. హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రమంతా హలీమ్ ను వండి వడ్డిస్తున్నారు. రంజాన్ మాసం వస్తే చాలు ప్రతి చోట హలీమ్ దుకాణా వెలుస్తాయి. ప్రతి దుకాణం హాలీమ్ ప్రియులతో నిండిపోతుంది.
 
హాలీమ్ కు ఇరాన్, ఇరాక్, తదితర అరబ్ దేశాల్లో తయారయ్యే హలీంలో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే వినియోగిస్తారు. కానీ హైదరాబాద్ హలీంకు మొదట నెయ్యి తోడైంది. ఆ తరవాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి జతకట్టాయి. ఆ తరువాత అనేక రకాల మార్పులతో మరింత గొప్ప రుచిని సంతరించుకుంది. ఏడో నిజాం నాటికి హలీంకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఇండోనేషియా, యెమన్, అరబ్ ఎమిరేట్స్, అమెరికా, బ్రిటన్‌లలో లొట్టలేసుకుంటూ ఆరగించే వంటకంగా హైదరాబాద్ హలీం నిలిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: