అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం గురించి అప్పుడే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది ? ప్రాచీన సంప్రదాయాలను గుర్తు తెచ్చేలా తీర్చిదిద్దుతారా.. లేదా? ఆర్.ఎస్.ఎస్, వి.హెచ్.పి సూచిస్తున్న అంశాలేమిటి? మందిరం కట్టడానికి ఎన్నేళ్లు పడుతుంది ? నిధుల సంగతేంటి ? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జనాలు విస్తృతంగా చర్చిస్తున్న అంశాలివే.
మన దేశంలో రాముడి గుడి లేని గ్రామాలు చాలా తక్కువనే చెప్పాలి. చిన్నదో.. పెద్దదో.. సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. శ్రీరామనవమి రోజున వైభవంగా కల్యాణం నిర్వహించడం మన సంప్రదాయంలో భాగం. అలాంటిది ఆ భగవంతుడికే జన్మనిచ్చిన ప్రాంతం అయోధ్యలో రాముడి గుడి అంటే ఇంకెంత వైభవంగా ఉండాలి. రామాయణ ఘట్టాలు కళ్లకు కట్టి.. అల అయోధ్యాపురంలోనే.. శ్రీరాముడు నడయాడిన ఊరిలో.. ఆ దేవదేవుడి చెంతనే మనం ఆశీస్సులు తీసుకుంటున్న అనుభూతి అలాంటి మందిరంలో కలగాలి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం కోసం జరుగుతున్న విస్తృత చర్చలివే. అయోధ్యలో కట్టబోయే మందిరం ఇదేనంటూ గత 29 ఏళ్లుగా ప్రచారంలో నమూనా ఇదే.
ఈ నమూనాతో ఆలయ నిర్మాణం సాధ్యమేనా? చూపు తిప్పుకోనివ్వని ఆధ్యాత్మిక సౌందర్యం ఈ మందిరం సొంతమనే వారు కూడా ఉన్నారు. దీనిని భవ్య, దివ్య, మహా రామాలయంగా పేర్కొంటున్నవారికీ కొదవ లేదు. చిన్నగా కనిపించే నమూనాయే ఇంత అత్యద్భుతంగా ఉంటే.. ఇక వాస్తవ మందిరంలోకి అడుగుపెడితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేమంటారు కొందరు. ఇప్పుడు సమస్య కొలిక్కి రావడంతో.. రామ మందిర నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుంది. ఎప్పుడు అయోధ్య వెళ్దామా అని ఆతృతగా ఎదురు చూసే జనం చాలా మంది ఉన్నారు.
సుప్రీం తీర్పు ఇలా వచ్చిందో లేదో.. అదిగో మందిరమంటే.. ఇదిగో శిఖరమని అనేక ప్రచారాలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఆయా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు జనం. వాస్తవానికి మనం చూస్తున్న మందిర నమూనాను రామజన్మభూమి న్యాస్.. వి.హెచ్.పి ఆమోదించాయి. ఆ ప్లాన్ ప్రకారమే 29 ఏళ్లుగా అయోధ్య కరసేవపురంలో మందిర నిర్మాణానికి కావాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. రామ మందిరం ఎత్తు 128 అడుగులుగా చెబుతున్నారు. ఐదు ప్రవేశ ద్వారాలు.. 424 రాతి స్తంభాలు...ఆ స్తంభాలపై చెక్కిన శిల్పాలు.. ఇలా అనేక అంశాలు చూడగానే ఆకట్టుకుంటాయనే వాదన ఉంది. పొడవు 270 అడుగులు, వెడల్పు 140 అడుగులతో రెండు అంతస్థులుగా ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఇక నిర్మాణంలో తీసుకుంటున్న మరో జాగ్రత్త ఏమిటంటే.. సపోర్ట్ బేస్‌లో ఎక్కడా స్టీల్ వాడటం లేదని అంటున్నారు.
ఇప్పుడున్న నమూనా ప్రకారం అయోధ్యలో రామ మందిరం కట్టడానికి ఐదేళ్లు పడుతుందనేది నిపుణుల మాట. ఇప్పటి వరకూ 106 రాతి స్తంభాలు సిద్ధమయ్యాయి. సుప్రీం తీర్పు వల్ల అక్కడ పనులకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయోధ్యలో రోడ్లు సరిగా లేకపోవడంతో బయట రాష్ట్రాల నుంచి రాళ్లను తీసుకురావడం ఆలస్యమవుతోందని వి.హెచ్.పి నాయకులు చెబుతున్నారు.
సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ ట్రస్ట్ తరహాలోనే అయోధ్య ట్రస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక కీలకమైన ట్రస్ట్ సభ్యుల ఎంపిక మొత్తం ప్రధాని మోడీ సూచనల మేరకు జరుగుతుందని తెలుస్తోంది. అయోధ్య ఉద్యమాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లిన విశ్వహిందూ పరిషత్.. కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్ట్‌లో ఉండేందుకు యత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పాత్ర కూడా కీలకం కాబోతుంది. సోమనాథ్ ట్రస్ట్‌లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలు సభ్యులుగా ఉన్నారు. మరి.. అయోధ్య ట్రస్ట్‌లోనూ వారు సభ్యులుగా ఉంటారో లేదో చూడాలి.