ఈరోజే చంద్ర గ్రహణం... ఈరోజు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే...!

ఈ ఏడాదిలో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడనుండగా తొలి గ్రహణం జనవరి 10వ తేదీన సంభవించనుంది. భారత్ లో చంద్ర గ్రహణం రాత్రి 10.37 గంటలకు మొదలవుతుంది. దాదాపు 4 గంటల సమయం పాటు గ్రహణం కొనసాగుతుంది. అర్ధరాత్రి దాటి 2.42 గంటలకు గ్రహణం ముగుస్తుంది. పునర్వసు నక్షత్రం మిథునరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత్ తో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికాలలో కనువిందు చేయనుంది. 
 
రాత్రి గ్రహణ సమయంలో చంద్రుని జపం చేస్తే మనకు చాలా మంచిది. గ్రహణం రాత్రి సమయంలో కాబట్టి చాలామంది ఉదయాన్నే ఇంటిని శుద్ధి చేస్తూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. గ్రహణ సమయం ముగిసాక ఇంటి సభ్యులందరూ స్నానాలను ఆచరించి, ఇంటిని శుభ్రపరిచి దీపారాధన చేయాలి. గ్రహణం విడిచిన తరువాత దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. జంధ్యం వేసుకునే సాంప్రదాయం ఉంటే వారు జంధ్యాన్ని మార్చుకోవాలి. 
 
వ్యాపార సంస్థల ముందు, ఇంటి ముందు నరదృష్టి కోసం కట్టిన గుమ్మడికాయలు, కొబ్బరి కాయలు తీసివేసి కొత్తవి కట్టించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సంభవించే గ్రహణం స్వల్పంగా నీడ పడే ఖగోళ అద్భుతం. ఈరోజు వచ్చే గ్రహణం సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చీరానట్లుగా ఉంటుంది. చాలా స్వల్పంగా మాత్రమే నీడ పడుతుంది. చంద్రగ్రహణాన్ని చూడాలా...? వద్దా...? అని చాలా మందికి అనుమానాలు ఉంటాయి. కానీ చంద్ర గ్రహణం ఎటువంటి అపోహలు లేకుండా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
చంద్ర గ్రహణ సమయంలో వంట చేయకూడదని, ఏమీ తినకూడదని, తాగకూడదనే సాంప్రదాయం దేశంలో ఉంది. చాలా చోట్ల చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు ఇంట్లో పడుకుంటే మంచిదని సూచిస్తారు. చంద్ర గ్రహణం చూస్తే పుట్టబోయే బిడ్డకు మంచి జరగదని చాలా మంది నమ్ముతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: