టీటీడీ మరో సంచలన నిర్ణయం... తిరుమల ఆలయం మూసివేత...?
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో దాని ప్రభావం శ్రీవారి ఆలయంపై కూడా పడింది. ఇప్పటికే అలిపిరి చెక్ పోస్ట్ ను మూసివేయగా... కొండపైకి వాహనాలను అనుమతించటం లేదు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జనసమూహం ఉండే ప్రాంతాలను నిరోధించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ తాజాగా మరికొన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అలిపిరి రహదారితో పాటు ఘాట్ రోడ్ రహదారిని కూడా మూసివేశారు. టీటీడీ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈరోజు టీటీడీ పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తిరుమల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటన రాకపోయినా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేసి , అర్చకులు స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఆలయం మూసివేత గురించి టీటీడీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. శ్రీవారి ఆలయంలోకి భక్తులను తాత్కాలికంగా అనుమతించటం లేదని తెలుస్తోంది.