శివం: శివుడు నందికి ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చాడో తెలుసా...?
శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. సాధారణంగా శివుని ఆలయంలో శివుని కంటే ముందుగా మనం నందిని దర్శించుకుంటూ ఉంటాం. పరమేశ్వరునికి నంది ద్వారపాలకుడు కాబట్టే ఆయనకు అంత ప్రాధాన్యత ఉంటుంది. శివుని భక్తులు కొందరు నంది రెండు కొమ్ముల నుంచి ఈశ్వరున్ని చూస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
మరికొందరు నంది చెవిలో తమ కోరికలను చెప్పుకుంటూ ఉంటారు. పూర్వం శిలాదుడనే ఋషి సంతానం కొరకు తపస్సు చేశారు. ఋషి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యారు. ఋషి తనకు కుమారుడిని ప్రసాదించాలని శివుడిని కోరగా స్వామి తథాస్తు అని దీవించారు. శివుని వరాన్ని పొందిన ఋషికి అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. శిలాదుడు ఆ బాలునికి నంది అని పేరు పెట్టాడు.
బాల్యం నుంచే నంది మేధస్సు అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే నంది సకల వేదాలను ఔపోసన పట్టాడు. ఒకరోజు మిత్రావరుణులు అనే దేవతలు ఆశ్రమానికి వచ్చి నంది చేసిన అతిథిసత్కారాలకు పరవశించిపోయి దీర్ఘాయుష్మాన్భవ అని ఆశీర్వదించబోయి ఒక నిమిషం ఆగిపోయారు. దేవతలు ఎందుకు ఆగిపోయారో అర్థం కాని ఋషి వారి నుంచి నంది ఆయుష్షు త్వరలొనే తీరిపోనుందని తెలుసుకున్నాడు.
విషయం తెలిసిన నంది శివుని కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. శివుడు ప్రత్యక్షమైన సమయంలో నంది ఆయన పాదాల చెంత ఉంటే ఎంత బాగుంటుందో కదా అని మనస్సులో అనుకున్నాడు. నంది శివుడిని "అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ" అని కోరగా శివుడు అందుకు అంగీకరిస్తారు. వృషభ రూపంలో వాహనంగా ఉండిపోవాలని అనుగ్రహించాడు. అప్పటినుండి నంది శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు.