శివం: శివపార్వతుల వివాహం జరిగింది ఇక్కడే.... ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలే ఉండవు...!
హిందూ సాంప్రదాయంలో పెళ్లిని అతి ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తారు. పెళ్లికి వచ్చిన పెద్దలు దంపతులు కలకాలం అన్యోన్యంగా సమస్యలు, గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని దీవిస్తారు. హిందూ సాంప్రదాయంలో భార్యాభర్తలను శివపార్వతులతో పోలుస్తారు. పెళ్లైన తరువాత భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా సంతోషంగా ఉండాలంటే ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉండే ఒక గుడిని సందర్శిస్తే మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు.
శివ భగవానుడు త్రిమూర్తుల్లో ఒకరు. పరిమితులు లేని వాడిగా, గొప్పవాడిగా శివుడిని కొనియాడతారు. శివపార్వతుల వివాహం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. శివపార్వతుల వివాహం చాలా విభిన్నంగా జరిగింది. పార్వతి శివుడిని పెళ్లి చేసుకోవాలని చాలా సంవత్సరాల పాటు తపస్సు చేయగా శివుడు తపస్సుకు మెచ్చి పార్వతిని వివాహం చేసుకున్నాడు. శివపార్వతుల వివాహం జరిగిన ఈ ప్రదేశం పెళ్లైన దంపతులకు పుణ్యక్షేత్రంలా మారింది.
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగినారాయణ్ అనే గ్రామంలో ఉండే శివాలయాన్ని దర్శిస్తే భార్యాభర్తల మధ్య ఉండే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. ఈ శివాలయంలో ఉన్న అఖండ్ దుని అనే ప్రదేశంలో మంట యాగాగ్ని రూపంలో మండుతూ ఉంటుంది. శివపార్వతులు ఈ మంట చుట్టూ ఏడడుగులు నడిచారని... అందుకే ఈ దేవాలయానికి అఖండ్ ధుని ఆలయం అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు.
ఈ శివాలయంలో ఉండే నీటి కొలనులో శివపార్వతుల వివాహం అనంతరం బ్రహ్మ స్నానం చేశాడని... అందువల్ల కొలనుకు బ్రహ్మ కుండ్ అనే పేరు వచ్చిందని... ఈ కొలనులో మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో ఉండే మరో కొలనులో శివుడు స్నానం చేశాడని... ఈ కొలనులో స్నానం చేసే దంపతులకు సంతాన సమస్య తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో ఉన్న మరో కొలనులో విష్ణువు స్నానం చేసి... శివుడి వివాహం దగ్గరుండి జరిపించాడని... అందుకే ఆ కొలనుకు విష్ణు కుండ్ అనే పేరు వచ్చిందని సమాచారం.