శివం: శివ భగవానుడి గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే...!
శివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు. సింధు నాగరికత కాలానికే శివుడు పూజలందుకున్నాడు. వేదాలలో రుద్రునిగా పేర్కొనబడిన శివునికి దేశంలో వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. శివుడిని భక్తులు ఆది దేవునిగాను, పరమాత్మగాను కొలుస్తారు. ప్రత్యేకంగా శివుడిని ఆరాధించే భక్తులను శైవులంటారు.
శివ అనగా కల్మషము లేనివాడు. జననమరణాలకు శివుడు అతీతుడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కో అర్థం ఉంటుంది. శివుని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి ప్రతీక. శివుని ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. శివుడు ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని సూచిస్తుంది. శివుడి దేహంపై గల విష సర్పాలు భగవంతుడి జీవాత్మలను సూచిస్తాయి.
చాలా మంది శివుడిని రుద్ర స్వరూపుడిగానే భావిస్తారు కానీ శివుడు ప్రేమ స్వరూపుడు కూడా. ఆగమ శాస్త్రాలు శివుడిని లింగరూపంలోను, మానవ రూపంలోను పూజించవచ్చని చెబుతున్నాయి. శివుడు ఎక్కువగా లింగ రూపంలో ప్రతిష్టించబడుచున్నాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయనమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్టితమై అవి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లాయి.
శివ పురాణంలో కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్ లను పంచ ఆరామాలని పిలుస్తూ ఉంటారు. శివుడిని నటరాజు అని కూడా పిలుస్తారు. శివుని కుడి చేతిలో ఉన్న ఢమరు సృష్టిని సూచిస్తుంది. శివుని నృత్యం విశ్వం యొక్క వినాశకమును సూచిస్తుంది. శివుడు అసాధారణమైనవాడు. స్మశాన వాటికలో తన స్థావరం ఏర్పరచుకుని తన శరీరాన్ని బూడిదతో నింపేస్తాడు. శివునికి మాత్రమే మూడవ కన్ను ఉంటుంది. శివుడు తన మూడవ కంటితోనే మన్మధుడిని కాల్చివేసి చితిభస్మమును చేశారని పురాణగాథల ద్వారా తెలుస్తోంది.